ప్రజాశక్తి-బల్లికురవ రూరల్: స్త్రీశక్తిని మహాశక్తిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదే అని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మార్టూరు మండలం జొన్నతాళిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన బల్లికురవ మండలంలోని గుంటుపల్లి, నక్కబొక్కలపాడు గ్రామాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై గ్రామాల వారీగా సమీక్షించారు. సమాజంలో మహిళలను గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టి, వారిని ఒక మహాశక్తిగా మార్చిన ఘనత టీడీపీదేనని అన్నా రు. మహాశక్తి పథకం ద్వారా మహిళలను ఆదుకునేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారని చెప్పారు. జగన్‌రెడ్డి ఎన్నికల్లో మహిళలకు మాయమాటలు చెప్పి అరచేతిలో స్వర్గం చూపించాడని, నవరత్నాల పేరుతో నవమోసాలకు తెరలేపాడని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం మహిళలను దగా చేసిందని అందుకే మహిళలకు న్యాయం చేసేందుకు చంద్రబాబు మహాశక్తిని రూపకల్పన చేశారని చెప్పారు. 18నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అందుతుందని, అలాగే ఆడబిడ్డ నిధి (మహిళా నిధి) పేరుతో మహిళా సాధికారత కల్పించడంతోపాటు ఆర్థికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని చెప్పారు. దుర్మార్గుల చేతికి పాలన అందితే.. ఆ రాజ్యం అంతా అశాంతిమయమని జగన్ పాలన రుజువు చేస్తోందని అన్నారు. జగన్‌రెడ్డి నాలుగేళ్ల పాలనంతా అరాచకాలు, అకత్యాలే అని పేర్కొన్నారు. జగన్ స్వామ్యంలో ప్రజలకు కష్టాలే మిగిలాయని వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. జూలై 21 నుంచి ఆగస్టు 21వరకు ఇంటింటికీ ఓటరు వెరిఫికేషన్ కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండి దొంగ ఓట్ల నమోదు, టీడీపీ అనుకూల ఓట్ల తొలగింపు అంశాలను సీరియస్‌గా తీసుకోవాలని అన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌ఛార్జులు నడుం బిగించాలన్నారు. ఓటరు జాబితాలో నుంచి బోగస్ ఓటర్ల ఏరివేత, మరణించిన వారి పేర్ల తొలగింపు, యువ ఓటర్లు నమోదు ప్రక్రియ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువాలని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ నేతలకు దిశానిర్దేశం చేశారు.










