Mar 12,2021 07:05

   స్త్రీలను గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతి మాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగభాగమైన మహిళలను హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా లేదూ? ఇలాగైతే భవిష్యత్తు అంతా అంధకారమే కదా ?
  వరుసగా జరిగిన మానవ వాదుల హత్యలు, హేతువాదులపై దాడులు, ఆలోచనాపరులైన రచయితలపై ఒత్తిళ్ళు, నోట్ల రద్దు, జిఎస్‌టి, బ్యాంకుల దివాళా, రైతుల లాంగ్‌ మార్చ్‌ వంటివన్నీ భవిష్యత్తు చీకటిగా వుండబోతోందని హెచ్చరిస్తున్నాయి. ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. అందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఒక కారణమైతే, వివిధ రాష్ట్రాలలోని పాఠ్యపుస్తకాల్లోని అంశాలు మరొక కారణం. పాఠ్యపుస్తకాలలో అసంబద్ధమైన అంశాలు, అసత్యాలు ఎలా చోటు చేసుకున్నాయో గమనించండి. పదమూడు-పదిహేను సంవత్సరాల మధ్య వయసున్న బాలబాలికలకు తప్పుడు సమాచారం అందించడమంటే, వారిని తప్పుడు వ్యక్తులుగా తయారు చేయడమే కదా? గుజరాత్‌లో యాభై వేలమంది చదువుకునే ఒక సామాన్య శాస్త్ర పాఠ్య గ్రంథంలో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో జపాన్‌, అమెరికాపై అణుయుద్ధం ప్రకటించిందని ఉంది. వక్రీకరించిన చారిత్రక అంశాలు చదువుకుని భావి భారత పౌరులు ఎలా తయారవుతారన్నది ఆందోళన పడాల్సిన విషయం.
   అదేవిధంగా స్త్రీల గౌరవాన్ని దిగజార్చే అంశాలు పాఠ్యగ్రంథాల్లో చేర్చడం వల్ల భవిష్యత్తులో మహిళల పరిస్థితి ఏమిటీ? రాజస్థాన్‌లో బోధిస్తున్న ఒక పాఠ్య గ్రంథంలో స్త్రీలను గాడిదలతో పోల్చారు.
  ఉదయం నుండి రాత్రి వరకు స్త్రీలు గాడిదల్లా చాకిరి చేయాల్సి ఉంటుందని హిందీ పాఠ్య పుస్తకంలో సెలవిచ్చారు. గాడిదలకు చెట్టు కింద కాసేపు విశ్రాంతి ఇవ్వొచ్చు. కానీ స్త్రీలకు ఇవ్వకూడదు. 'పాపం గాడిదలు పారిపోయినా వెంటనే మళ్ళీ దొరుకుతాయి. వాటికి స్త్రీల వలే పుట్టింటికి పారిపోయే సౌకర్యం లేదు' అని ఆ పాఠం రాసిన రచయిత ఓ చమక్కు విసిరాడు. ఆ విషయాన్ని కింది స్థాయి నుండి పై స్థాయి అధికారుల దాకా అందరూ ఆమోదించారు. కాస్త సున్నిత మనస్కులు, ఇంగిత జ్ఞానం ఉన్న ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులు ఎవరైనా ఉంటే ఆ పాఠం పిల్లలకు ఎలా చెప్తారు ?
   మనసు చంపుకొని ఉద్యోగ ధర్మంగా పాఠం చెప్పడమంత శిక్ష మరొకటి ఉండదు కదా? 'పిల్లల పాఠంలో అలాంటి అంశం ఎందుకుంద'ని ఒక జాతీయ పత్రికా విలేకరి సంబంధిత అధికారిని అడిగారు. దానికా అధికారి...ఏదో పిల్లలకు కాస్త సరదాగా ఉంటుందని అలా పెట్టి ఉంటారు? అదో పెద్ద విషయమా? అని ఎదురు ప్రశ్నించాడు. ''భార్యలు గాడిదల్లాంటి వారు'' అన్న వాక్యంలో అతనికి ఏ తప్పూ కనిపించలేదు. బిజెపి ప్రభుత్వాలున్న గుజరాత్‌, రాజస్థాన్‌లలో అధికారులకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు అలాగే కేంద్ర ప్రభుత్వం వారికీ ఎవరికీ అందులో తప్పే కనిపించలేదు. వీళ్ళంతా ఆధునిక మనువాద ప్రతినిధులన్న మాట!
  సెంట్రల్‌ బోర్డ్‌ ఫర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) పాఠ్య పుస్తకంలో పది, పదకొండేళ్ళ పిల్లలు చదువుకునే పుస్తకంలో మాంసాహారం తినేవారి వల్ల సమాజంలో దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఉంది. మాంసాహారం తీసుకునేవారు అవలీలగా అబద్ధాలు చెప్తారని, ఇచ్చిన వాగ్ధానాలు నిలబెట్టుకోరని, అల్లర్లు, అలజడులు సృష్టిస్తారని, ముఖ్యంగా లైంగిక దాడులకు పాల్పడతారని, వారికి నిజాయితీ- నిబద్ధత ఉండదని, ఊరికే ఆవేశపడి బూతులు మాట్లాడతారని ఉంది. ఇలా దోషాలన్నీ మాంసాహారులకు అంటగట్టి పసి మనసుల్ని ప్రభావితం చేయడం ఎంతవరకు సబబు? ఏ ఆహారం తీసుకుంటే ఏయే లాభాలున్నాయి? ఎందులో ఎన్ని నష్టాలున్నాయి? అనేది శాస్త్రీయంగా వివరించాలి. ఆహారం ఎంచుకునే స్వేచ్ఛ పిల్లలకు ఇవ్వాలి. అంతేగాని నైతికంగా దిగజారిన వారి లక్షణాలన్నీ గుదిగుచ్చి మాంసాహారులకు ఆపాదిస్తే అది నిజమైపోదు కదా? ఒక రకంగా చూస్తే మాంసాహారులు, శాఖాహారులు ప్రపంచంలో సమానంగా ఉండి ఉంటారు. లేదా మాంసాహారుల సంఖ్యే ఎక్కువగా ఉండి ఉంటుంది. అట్లని శాఖాహారులంతా సచ్ఛీలురు, సత్యవ్రతులు, సత్‌ప్రవర్తన గల మహానీయులు కాదు గదా? ఈ విషయమే సిబిఎస్‌ఇ డైరెక్టర్‌ని అడిగితే పాఠ్యాంశాలపై దేశంలో నియంత్రణ లేదని, ఒక్కో ప్రాంతంలో ఒక్కో భాషలో విషయాలు ఒక్కో రకంగా ఉన్నాయని ఒప్పుకున్నారు.
   దేశానికి స్వాతంత్య్రం వచ్చి డెబ్బై ఏళ్ళయిపోయినా బాలబాలికలకు చెప్పాల్సిన పాఠ్యాంశాలపై నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడం ఘోరం! ప్రభుత్వాలు మారినప్పుడుల్లా అంశాలు, వక్రీకరణలు మారుతూ ఉండడం మరో ఘోరం!
  మధ్య భారతంలోని ఛత్తీస్‌గఢ్‌ లోని హైస్కూలు విద్యార్థుల పాఠ్య గ్రంథంలో 'దేశంలో నిరుద్యోగ సమస్యకు మూల కారణం- మహిళలు' అని ఉంది. 'మహిళలు అన్ని రంగాల్లో విజృంభించడం వల్ల, అన్ని రకాల ఉద్యోగాల్లో చేరుతున్నందు వల్ల పోటీ ఎక్కువైంది. అభ్యర్థుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగానే నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది' అని ప్రభుత్వం వారు నిర్థారించారు. స్త్రీ, పురుషులందరూ దేశ పౌరులైనప్పుడు పౌరులకు సమాన హక్కులున్నప్పుడు అందుకు తగిన విధంగా ప్రభుత్వాలు పని చేయాలి. ఉద్యోగావకాశాలు కల్పించాలి. అంతేగాని, మహిళలు చదువుకుని ఉద్యోగాలకు పోటీ పడడం వల్ల నిరుద్యోగ సమస్య పెరిగిందనడం అసంబద్ధంగా ఉంది. స్త్రీలను గాడిదలని, వారి వల్లే ఉద్యోగాలు లేకుండా పోయాయని, మాంసాహారులంతా నీతి మాలిన వారని చెపుతూ ఏ సమాజాన్ని నిర్మించాలని ప్రభుత్వం కలలు కంటోంది? జనాభాలో సగభాగమైన మహిళలను హీనంగా చూపిస్తూ ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించగలరా? పాఠశాల స్థాయి నుండే పిల్లలకు అసత్యాలను నూరిపోస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? ఎలాగైనా సరే మళ్ళీ మనువాదాన్ని నిలబెట్టే ప్రయత్నం బిజెపి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా లేదూ? ఇలాగైతే భవిష్యత్తు అంతా అంధకారమే కదా? అచ్ఛే దిన్‌, స్వచ్ఛ భారత్‌- నినాదాల కింద ఎంత మురుగు పేరుకు పోతోందో ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది. ఒక్కటంటే ఒక్కటి ముందడుగు వేయకపోగా, దేశం వెయ్యడుగులు వెనక్కి వేస్తున్నట్టుగా ఉంది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులూ నిజాలు గ్రహించి, పిల్లలకు వాస్తవాలు చెప్పాలి. వారికి హేతుబద్దంగా ఆలోచించడం నేర్పాలి.

(వ్యాసకర్త... సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త)
డా|| దేవరాజు మహారాజు

స్త్రీలను కించపరిచిన పాఠ్య గ్రంథాలు