ప్రజాశక్తి-బాపట్ల: 'స్త్రీల ఆరోగ్యమే దేశానికి రక్ష' అని బాపట్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎస్ విజయమ్మ అన్నారు. ఈ నెల 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమ వారం 'మహిళల ఆరోగ్యంతోనే శక్తివంతమైన భారతావని' అనే నినాదంతో బాపట్ల పట్టణంలో ఏవివి హైస్కూల్ విద్యార్థుల సైకిల్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించి దేశ ఆరోగ్య సంరక్షణకు సహక రించాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని అన్నారు. ఆహారం పట్ల మహిళలు చైతన్యవంతం అయితేనే కుటుంబమంతా సంపూర్ణ ఆరోగ్యంతో వెలుగొందుతారని అన్నారు. సంపూర్ణ సమాజ ఆరోగ్యం మహిళలతోనే సాధ్యమని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో టీ వెంకటేశ్వర్లు, డిఐఒ సౌజన్య, హెల్త్ ఎడ్యుకేటర్లు ఇస్మాయిల్, లక్ష్మి, సుధారాణి, అర్బన్ వైద్యాధికారులు, హెల్త్ ఎడ్యుకేటర్లు, హెచ్‌వి ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అద్దంకి: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సింగరకొండ కట్ట రామకోటేశ్వరరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ సింగరకొండ మాజీ అధ్యక్షులు నర్రా శ్రీలక్ష్మి ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహిళలు అన్ని రంగాలలో పురుషు లతో సమానంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, మూఢనమ్మకాలు వంటి సమస్యలను రూపుమాపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. మహిళలను గౌరవించడం ద్వారా సమాజంలో వారు పలు అవకాశాల ను అందిపుచ్చుకోవడానికి మార్గం సుగమం అవుతుందని కళాశాల ప్రిన్సిపాల్ వి మోహన్‌రావు అన్నారు. మహిళలు వివక్ష లేని సమాజాన్ని చూడాలని, మహిళా సాధికారిక విభాగం కన్వీనర్ డాక్టర్ హేమలత అన్నారు. ఈ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా విభాగం అధికారిని డాక్టర్ సి అనిత, ఆంగ్ల అధ్యాపకురాలు ఎన్ షర్మిలారాణి, ఐక్యు ఏసి కోఆర్డినేటర్ ఎన్‌వి రమణ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జాతీయ సేవా పథకం అధికారి డాక్టర్ కె ప్రభుదాస్, డి రాజశేఖర్ సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొన్నారు.
పర్చూరు: బాలబాలికలందరూ 14 సంవత్సరాల వరకు ప్రభుత్వం కల్పించే ఉచిత విద్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్యానల్ అడ్వకేట్ రావి రమేష్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతున్న న్యాయవిజ్ఞాన సదస్సుల్లో భాగంగా పర్చూరు వైఆర్ హైస్కూలులో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మనోవర్తి, ఆస్తి హక్కు, బాల్యవివాహాలను నిరోధించటం, మైనార్టీ తీరిన తర్వాత వివాహం చేయాలనే చట్టాలు మహిళలకు ప్రత్యేకంగా ఉన్నాయన్నారు. స్త్రీలు విద్యావంతులైతే కుటుంబం అభివృద్ధి చెందుతుందని, తద్వారా దేశం పురోభివృద్ధి సాధిస్తుందని గుర్తు చేశారు. కష్టపడి ఇష్టంతో చదువుకొని విద్యార్థినులంతా మంచి ఉద్యోగాలు సాధించి, ఉన్నతాశయాలను సాధించాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈదర రాజశేఖర్, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
సంతనూతలపాడు రూరల్: స్త్రీ పురుష సమానత్వం కోసం మహిళా లోకం ఉద్యమించాలని పిఒడబ్ల్యు జిల్లా అధ్యక్షురాలు ఎస్ భారతి పిలుపునిచ్చారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మద్దులూరులో సోమవారం వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేడు సమాజంలో అన్ని రంగాల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న స్త్రీలు నేటికీ రెండో తరగతి పౌరులుగానే పరిగణించబడుతున్నారని ఆమె అన్నారు. స్త్రీ పురుష వివక్షత లేని సమాజం కోసం మహిళలంతా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఒడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి వై సుశీల, నాయకులు శ్రీదేవి, మాధవి, సౌజన్య, నాగమ్మ తదితరులు పాల్గొన్నారు.










