స్త్రీ విద్య తోనే సమాజాభివృద్ధి
ప్రజాశక్తి -తిరుపతి టౌన్
స్త్రీ విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని వక్తలు ఉద్ఘాటించారు. సెప్టెంబర్ 28న సర్దార్ భగత్ సింగ్ 116 వ జయంతి సందర్భంగా వారం రోజులు పాటు వివిధ విద్యాసంస్థల్లో సామాజిక అంశాల పై సెమినార్ లను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా గేట్ డిగ్రీ కళాశాల నందు విద్య ప్రాముఖ్యత- మహిళా సమస్యలు - అంశం పై గేట్ డిగ్రీ కళాశాల లో సెమినార్ నిర్వహించినట్లు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తెలిపారు. ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు రవి అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో శ్రీ పద్మవతి జూనియర్ కళాశాల అధ్యాపకురాలు భారతి, ఐద్వా జిల్లా కార్యదర్శి సాయి లక్ష్మి, ఎస్ ఎఫ్ ఐ కార్యదర్శి మాధవ్ లు ముఖ్య అతిధులు గా హాజరై ప్రసంగించారు. ఒక కుటుంబంలో మహిళ విద్యాభ్యాసం చేస్తే ఆ మహిళతో పాటు ఆ కుటుంబం మొత్తానికి లబ్ది చేకూరుతుందని తెలిపారు. సమాజంలో కేవలం మాటలలో మాత్రమే స్త్రీలను గొప్ప గా కీర్తిస్తున్నారని, కానీ వాస్తవంగా సమాజం లో ప్రతి క్షణం మహిళలపై దాడులు, అత్యాచారాలు, వివక్షత రోజు రోజుకు భయంకరంగా పెరుగుతున్నాయన్నారు. వీటన్నింటిని ధైర్య, సాహసాలకు చిరునామాగా భావించే భగత్ సింగ్ స్పూర్తితో ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకొని, సమాజంలోని రుగ్మతలు పైన, సమాన హక్కులకై అమ్మాయిలే ముందడుగు వేయాలని వారు పిలుపునిచ్చారు. సమాజం లో కుటుంబం నుంచే ఎలాంటి వివక్షత లేకుండా అబ్బాయిలతో సమానంగా పెంచితే మహిళలపై గౌరవం పెరుగుతుందని, సమానంగా చూసే సోదరభావం పెంపొందించేలా చైతన్యవంతం గా ఆలోచనలు పెంచుకోవాలని కోరారు.. కేంద్రం తీసుకొస్తున్న నూతన విద్యా విధానం ద్వారా అమ్మాయిల చదువులను మరింత దూరం చేసే కుట్ర జరుగుతుందని, ఎన్ ఈ పి కు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. భగత్ సింగ్ ను స్మరించుకొని వివక్ష లేని సమాజం కోసం, ఆకలి, పేదరికం లేని స్వాతంత్రం కోసం అందరికీ విద్యా, ఉపాధి, వైద్యం కోసం ఎస్ ఎఫ్ ఐ సాగించే పోరాటాలలో పాలుపంచుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు జయంతి, ఎస్ ఎఫ్ ఐ ఉపాధ్యక్షులు అక్బర్, అశోక్, జెవివి నాయకులు హేమంత్ పాల్గొన్నారు.
సదస్సులో మాట్లాడుతున్న ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి










