Jun 29,2023 20:04

ట్రాఫిక్‌ను పునరుద్ధరిస్తున్న సిఐ శ్రీనివాసులు

ప్రజాశక్తి - మంత్రాలయం
ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన మంత్రాలయంలో ట్రాఫిక్‌ సమస్య నెలకొంది. ట్రాఫిక్‌ నియంత్రణకు సిఐ శ్రీనివాసులు రంగంలోకి దిగి వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చూశారు. గురువారం బక్రీద్‌ పండగ సెలవుదినం కావడం, తొలి ఏకాదశీ సందర్భంగా రాఘవేంద్రస్వామి వారి దర్శనార్థమై దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల ద్వారా భక్తులు మంత్రాలయం చేరుకున్నారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి పోలీసులు రాఘవేంద్ర సర్కిల్‌లో ఉన్న ఆర్చీ నుంచి వాహనాలను లోపలికి పంపించకుండా నాగలదిన్నె దారి వైపు మళ్లించారు. దర్శనానంతరం భక్తులు వాహనాలు ఆర్చీ గుండా వస్తుండడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. అప్పటికే పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ వాహనాలను బయటకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు ఎమ్మిగనూరు వైపు నుంచి భారీ వాహనాలు రావడంతో కొంత సేపు సిబ్బందికి గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సిఐ శ్రీనివాసులు స్వయంగా రంగంలోకి దిగి వాహనాలను నిలిపి వేసి ఒక్కో దిక్కు నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం కావడంతో అటు గ్రామస్తులు, ఇటు పాదాచార భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. సెలవులు వచ్చాయంటే చాలు ఇదే సమస్య పునరావృతం అవుతోందని, సమస్య శాశ్వత పరిష్కారానికి శ్రీమఠం యాజమాన్యం చర్యలు తీసుకోవాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.