
ప్రజాశక్తి - భట్టిప్రోలు
స్థానిక పోలీస్ స్టేషన్ నుండి చెరుకుపల్లి వైపు వెళ్లే రహదారి మార్గంలో అద్దేపల్లి వరకు ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు బల్బులు కూడా ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని ఆ ప్రాంత వాసులు కోరుచున్నారు. పోలీస్ స్టేషన్ నిర్మించక ముందు భట్టిప్రోలు బస్టాండ్ నుండి అద్దేపల్లి, ఇందిరాకాలనీ వరకు మాత్రమే విద్యుత్తు లైనుండేది. పోలీస్ స్టేషన్ నిర్మాణంతో దానికి సమీపంలో అద్దేపల్లి బస్టాండ్ వరకు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. వీటికి రహదారి వెంట నిర్మించిన గృహాల వరకు స్తంభాలకు బల్బులు వేశారు. అక్కడ నుండి బస్టాండ్ వరకు మరో మూడు స్తంభాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్తంభాలకు కూడా విద్యుత్ బల్బులు ఏర్పాటు చేస్తే అద్దేపల్లి వరకు రాత్రి వేళల్లో పాదచారులకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెబుతున్నారు. సంబంధిత పంచాయతీ అధికారులు చొరవ చూపి సమస్యను పరిష్కరించాలని కోరారు. గత నాలుగైదు ఏళ్లుగా ఈ మూడు స్తంభాలకు విద్యుత్ బల్బులు ఏర్పాటు చేయాలని కోరుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ఆ ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారు. అద్దేపల్లి నుండి నిరంతరం పోలీస్ స్టేషన్‌కు, బస్టాండ్ వరకు వివిధ పనులపై ప్రజలు తిరుగుతూ ఉంటారు. ఒక్కోసారి రేపల్లె నుండి గుంటూరు వెళ్ళే ఎక్స్ప్రెస్ బస్సులు అద్దేపల్లికి వెళ్లడానికి బస్టాండ్లో దిగి అద్దేపల్లి వరకు నడిచి వెళుతూ ఉంటామని, రాత్రి వేళల్లో చీకటిలో పాములు, జరులు కాళ్లకు అడ్డుపడుతూ ప్రమాదపరితంగా ఉంటుందని వాపోతున్నారు. ఈ మూడు స్తంభాల్లో ఒక స్తంభానికి విద్యుత్ ట్రాన్స్ఫారం కూడా బిగించి ఉందని తెలిపారు. దీని సమీపంలో అద్దేపల్లి గ్రామానికి అవసరమైన త్రాగునీటి బోర్లు కూడా ఏర్పాటు చేసి ఉండటంతో నీటిని విడుదల చేయడానికి కూడా సిబ్బంది అనునిత్యం ఇక్కడికి వస్తూ ఉంటారు. కానీ స్తంభానికి ట్రాన్స్‌ఫార్మర్ ఉన్నప్పటికీ విద్యుత్ బల్బు లేకపోవడంతో సిబ్బందికి చీకటిలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి ప్రాధాన్యత కలిగిన మూడు విద్యుత్ స్తంభాలకు విద్యుత్ బల్బులను ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని బల్బులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శి కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ నుండి అద్దేపల్లి బస్టాండ్ వరకు ఉన్న స్తంభాలకు బల్బులు ఏర్పాటు చేస్తామని అన్నారు.