
సతీష్ రెడ్డి సేవలు అందరికీ ఆదర్శం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్ : దేశం గర్వించదగ్గర శాస్త్రవేత్త, మాజీ డిఆర్‌డిఒ చైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని, ఇలాంటి వారిని చూసి మరెంతో మంది తాము పుట్టిన గ్రామాలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నారని ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహిమలూరు గ్రామంలో మాజీ డిఆర్‌డిఒ చైర్మన్ గుండ్రా సతీష్ రెడ్డి దాతృత్వంతో శంకర నేత్రాలయం, చెన్నరు వారి ఆధ్వర్యంలో నిర్వహించి ఉచిత కంటి వైద్య శిబిరంలో ఎంఎల్‌ఎ మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఇంతటి స్థాయిలో కంటి శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు పరిశీలించారు. శంకర నేత్రాలయం ఆధ్వర్యంలో ఆపరేషన్లు చేయించుకుని పలువురు వృద్ధులు, మహిళలతో మాట్లాడారు. వైద్యశాల ఆధ్వర్యంలో అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. శంకర నేత్రాలయం వారు ఆపరేషన్లు నిర్వహించేందుకు ఏర్పాటు చేసుకున్న మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ వాహనాలను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. శంకర నేత్రాలయ అందరికీ కంటికి సంబంధించిన ఆపరేషన్లు చేసేందుకు మొబైల్ యూనిట్ వాహనాలను ఏర్పాటు చేసి ఎలాంటి ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఆపరేషన్లు నిర్వహించడం చాలా అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. అనంతరం ఎంఎల్‌ఎ విక్రమ్‌రెడ్డి మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ వ్యక్తి, ప్రపంచంలోనే ప్రముఖుడు అయిన గుండ్రా సతీష్ రెడ్డి మహిమలూరు తన స్వగ్రామానికి సేవ చేస్తూ అందరి మన్ననలు పొందారన్నారు. అలాంటి వ్యక్తి తమ గ్రామానికి అవసరమైన అన్నింటినీ అందజేస్తూ గ్రామానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించిన ఆమెరికాలో ఉంటున్న డాక్టర్ రూబి నెహర్ రూ.18లక్షలు సేవా కార్యక్రమాల నిర్వహణకు అందచేశారని, ఈ సందర్భంగా ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇలా ప్రతి పంచాయతీని అభివృద్ధి చేసేందుకు ఇలాంటి వ్యక్తులు ముందుకు వస్తే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తాము పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనేక మందికి మనసులో ఉన్నా ఎలా చేయాలో తెలియక ఉన్న సమయంలో అందరి భాగస్వామ్యంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిందే ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం అని తెలిపారు. ఈ డెవలప్‌మెంట్ ఫోరం ఏర్పాటు చేసిన అనంతరం వేరే రాష్ట్రాల్లో, దేశాల్లో ఉన్న వారు ఆత్మకూరు డెవలప్‌మెంట్ ఫోరం ద్వారా భాగస్వామ్యులవుతున్నారని, వారు తమ గ్రామంలో సూచించిన అభివృద్ధి పనులను ఎడిఎఫ్ ద్వారా పూర్తి చేస్తున్నామని, వారు పంపే ప్రతి రూపాయి అభివృద్ధి పనులకు వినియోగిస్తామని వివరించారు. నెలవారీ జీతాలు తీసుకునే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు సైతం ఎడిఎఫ్ ద్వారా తమ గ్రామాల అభివృద్ధికి నెల జీతం నుంచి నగదు అందజేస్తామని ప్రకటిస్తున్నారని, రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ఈ ఎడిఎఫ్ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆత్మకూరు నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని, ప్రతిఒక్కరి సహకారం అవసరమన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కేత వేణుగోపాల్ రెడ్డి, సిండికేట్ ఫార్మర్ సొసైటీ చైర్మన్ సానా వేణుగోపాల్ రెడ్డి, బిజెపి నాయకులు కుడుముల సుధాకర్ రెడ్డి, సర్పంచ్ చంద్రశేఖర్, శంకర నేత్రాలయం డాక్టర్ అరుణ్ కుమార్, వైసిపి నాయకులు చెరుకూరి శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.