Jul 22,2021 21:06
  • వివిధ పార్టీల నేతలకు స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు విజ్ఞప్తి
  • కార్మికుల ఉద్యమానికి మద్దతుంటుందన్న నేతలు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : విశాఖ స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు సహకరించాలని, ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు కోరారు. ఈ మేరకు గురువారం వివిధ పార్టీల నేతలను కలిసి తమ ఉద్యమానికి మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ, ఆప్‌, వైసిపి తదితర పార్టీ నేతలను పోరాట కమిటీ నేతలు కలిశారు. విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, ప్రైవేటీకరణ ఆలోచనను వెనక్కి తీసుకోవాలని ఆగస్టు 2, 3 తేదీల్లో ఢిల్లీలో జరిగే ఆందోళనలో భాగస్వామ్యం కావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. ఉక్కు కార్మికుల ఉద్యమానికి మద్దతు ఉంటుందని ఆయా పార్టీల నేతలు పేర్కొన్నారు. సిపిఎం కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి రాఘవులను కలిసి తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన నేతలు కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని, తాము కూడా ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని పేర్కొన్నారు.

స్టీల్‌ప్లాంటు పరిరక్షణకు సహకరించండి

అనంతరం సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌ జిత్‌ కౌర్‌, సిపిఐ జాతీయ కమిటీ సభ్యులు కన్నయ్య కుమార్‌ను కలిసి మద్దతు కోరారు. ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలపై తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. అలాగే కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్‌ను, ఆప్‌ పార్లమెంటరీ పక్షనేత సంజయ్‌ సింగ్‌ను, వైసిపి పక్షనేత విజయసాయి రెడ్డి, సిపిఎం పక్షనేత ఎలమరం కరీం, సిపిఐ పక్షనేత బినరు విశ్వంను కలిసి పార్లమెంటులో స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ వ్యతిరేక గళం వినిపించాలని కోరారు. అందుకు వారు ఇప్పటికే పార్లమెంటులో ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, దాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

య్‌

ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంటును ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్‌ చేశారు. పార్లమెంటులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని, మరో రెండు రోజుల్లో అనేకమంది ఇతర జాతీయ, ప్రాంతీయ పార్టీల ఫ్లోర్‌ లీడర్లను, నాయకులను కలిసి వారి మద్దతు కూడా కోరే ప్రయత్నం చేస్తామని తెలిపారు. స్టీల్‌ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్లు సిహెచ్‌ నర్సింగరావు, మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, పోరాట కమిటీ నేతలు గణపతి రెడ్డి, అంబేద్కర్‌, వరసాల శ్రీనివాసరావు, టి.దేవరరెడ్డి, కామరాజు, శ్రీను, మధు తదితరులు పాల్గొన్నారు.

య్‌

 

య్‌

 

య్‌

 

య్‌