Oct 26,2022 23:42

దీక్షలో కూర్చున్న స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎం, ఎస్‌బిఎం విభాగాల కార్మికులు

   ప్రజాశక్తి-ఉక్కునగరం, విశాఖ : విశాఖ ఉక్కు ప్రభుత్వరంగంలోనే కొనసాగుతుందని ప్రధానమంత్రి విశాఖ పర్యటనకు ముందే ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌ చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం నాటికి 622 రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎల్‌ఎంఎం, ఎస్‌బిఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షల నుద్దేశించి పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బిజెపి జిమ్మిక్కులకు తెరలేపిందన్నారు. దీనిలో భాగంగా రైల్వేస్టేషన్‌ నవీకరణ పనులకు శంకుస్థాపన చేస్తున్నారన్నారని తెలిపారు. రైల్వే జోన్‌, ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలను తుంగలో తొక్కి ఎన్నికల తాయిలాలకు బిజెపి సిద్ధమైందని విమర్శించారు. నవంబర్‌ 11న నల్లజెండాలతో నిరసన తెలుపుదామని పిలుపునిచ్చారు. దీనిపై పోరాట కమిటీ పూర్తిస్థాయి సమావేశం నిర్వహించి, ప్రధాని పర్యటనపై కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు.
ప్రజలకిచ్చిన హామీలను గాలికొదిలేసి కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ పాలనపై కార్మికులు, కర్షకులు యావత్‌ ప్రజానీకం వ్యతిరేకంగా ఉన్నారన్న విషయాన్ని బిజెపి నాయకులు గుర్తించాలన్నారు. 100 శాతం ప్రైవేటీకరణ చేస్తామని లేకుంటే మూసివేస్తామని పార్లమెంట్‌లో ప్రకటించిన బిజెపి మంత్రుల ప్రకటనపై ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అమ్మడానికి మూసివేయడానికి బిజెపి ప్రభుత్వం నిర్మించిన సంస్థ కాదని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమను ప్రైవేటువ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు సహించబోరని హెచ్చరించారు. ఈ దీక్షా శిబిరంలో సీతారామరాజు, గాలి నాయుడు, సుబ్బరాజు, శ్రీనాథ్‌, భాస్కర్‌, బషీర్‌బాబు, తదితరులు పాల్గొన్నారు.