
ప్రజాశక్తి- అనకాపల్లి
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై బిజెపి పాలకులకు వత్తాసు పలుకుతూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన ప్రకటనలు అర్ధరహితమని సిపిఎం సీనియర్ నాయకులు ఎ.బాలకృష్ణ విమర్శించారు. స్థానిక దొడ్డి రాము నాయుడు భవనంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి అమర్నాథ్ ప్రకటనలు తమ ప్రభుత్వ అసమర్ధతను కప్పిపుచ్చుకునేలా ఉన్నాయన్నారు. తమ ప్రకటనలతో ప్రజలను ఎల్లకాలం మోసగించలేరని గుర్తుంచుకోవాలని హితవుపలికారు. అమర్నాథ్ ప్రకటనను తక్షణమే వాటిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వత్తాసు పలుకుతూ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. సిపిఐ, సిపిఎంలు చేపట్టిన ప్రచార భేరిలో వీరి బండారాన్ని బయట పెడతామన్నారు. సిపిఎం జిల్లా నాయకులు వివి శ్రీనివాసరావు, అల్లు రాజు, మండల నాయకులు కాళ్ళ తేలయ్య బాబు, నజీర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుకరణకు వ్యతిరేకంగా తమ రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థల ద్వారా బిడ్డు దాఖలు చేస్తామని ప్రకటన చేయడం ప్రైవేటీకరణకు మద్దతు ఇస్తున్నట్టు మంత్రి అమర్నాథ్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ ప్రభుత్వానికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో అన్ని పార్టీలను కలుపుకొని మోడీ ప్రభుత్వంపై ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.