ప్రజాశక్తి-ఉక్కునగరం, కలెక్టరేట్ : స్టీల్‌ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించే సమర్థత ఉంటే ఉండండి, లేకుంటే రాజీనామా చేసి వెళ్లిపోండి.. అంతేగాని ప్లాంట్‌ను సహజమరణం దిశగా నెట్టాలని ప్రయత్నం చేస్తే సహించేది లేదని యాజమాన్యానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ హెచ్చరించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 532 వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగ కార్మికులు కూర్చున్నారు. ఇటీవల ఎస్‌ఎమ్‌ఎస్ అగ్ని ప్రమాదంలో మరణించిన కె.శ్రీనివాసరావుకు ముందుగా నివాళులర్పించారు. ప్లాంట్‌లో పని పరిసరాల వద్ద సేఫ్టీ ప్రమాణాలు పెంచాలని ముక్తకంఠంతో నినదించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు చిత్రాడ సన్యాసిరావు, జె.రామకృష్ణ, వరసాల శ్రీనివాసరావు, కొమ్మినేని శ్రీనివాసరావు, గుమ్మడి నరేంద్ర మాట్లాడుతూ, ఎంతో మంది త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం కానివ్వమని స్పష్టంచేశారు. ప్రత్యక్షంగా వేలాది మందికి, పరోక్షంగా లక్ష మందికి జీవనోపాధిని కల్పిస్తున్న కర్మాగారాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని మన రాష్ట్ర ఎంపీలందరూ కలిసి ప్రస్తుత పార్లమెంట్‌లో గళమెత్తాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను సమైక్యంగా ఎదుర్కోవడం కోసం కార్మిక వర్గాన్ని సమాయత్తం చేయాలన్నారు. ఈ దీక్షల్లో ఎస్‌ఎంఎస్-1 విభాగానికి చెందిన పి.వెంకటేశ్, డివి.నాగబాబు, కె.రాజబాబు, జివి.సుబ్బయ్య, రమణమూర్తి, బి.అప్పారావు, పూర్ణచంద్రరావు, మీరయ్య, జి.ఆనంద్ పాల్గొన్నారు.
ప్రయివేటీకరణను అడ్డుకుంటాం
కలెక్టరేట్ : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల మద్దతుతో అడ్డుకొని తీరుతామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వై.రాజు స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 483వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఐటియు జగదాంబ జోన్ నాయకులు, ఎఐటియుసి నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ ప్రస్తుతం లాభాల్లో ఉండగా ప్రయివేటీకరణ చేస్తామని చెప్పడం భావ్యం కాదన్నారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, ప్లాంట్ రుణాలను ఈక్విటిగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఐటియుసి జిల్లా కార్యదర్శి ఎస్‌కె.రెహమాన్, పి.సత్యనారాయణ, సిఐటియు జగదాంబ జోన్ అధ్యక్షులు ఎం.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.










