
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలని ప్రయత్నిస్తే సహించేది లేదని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటకమిటీ ప్రతినిధి వైటి.దాస్ స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చ్ వద్ద చేపట్టిన దీక్షలు 957వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరంలో స్టీల్‌ప్లాంట్ ఇఎస్‌ఎఫ్, ఇఆర్‌ఎస్, ఇఎండి విభాగాల ప్రతినిధులు, కార్మికులు కూర్చున్నారు. దీక్షనుద్దేశించి వైటి.దాస్ మాట్లాడుతూ, ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ మంత్రి కులస్తే రాక దేనికి సంకేతమని ప్రశ్నించారు. కర్మాగారంలోని కీలక విభాగాలను ప్రయివేటు వారికి అప్పగించే కుట్రలను తెరలేపడానికా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీగా సమావేశం నిర్వహించామని, దానిలో స్టీల్ మంత్రి పర్యటనపై తమ నిరసనను తెలియజేయడం ద్వారా కార్మికుల ఆగ్రహాన్ని వారికి తెలియజేయడం జరుగుతుందని వివరించారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
పోరాట కమిటీ చైర్మన్ డి.ఆదినారాయణ మాట్లాడుతూ, మంత్రి ఇక్కడికి వచ్చిన సమయంలో మాటలు మార్చిన సంగతిని గుర్తు చేశారు. నిలకడ లేని ప్రకటనలతో కార్మిక ఉద్యమాన్ని అణిచివేద్దామని ప్రయత్నిస్తే కార్మికులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఇప్పటికైనా మంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. పోరాట కమిటీ నాయకులు ఎన్.రామారావు మాట్లాడుతూ, విశాఖ ఉక్కును ముక్కలు చేసి అమ్మాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. పూర్తి సామర్థ్యంతో విశాఖ ఉక్కు ఉత్పత్తికి కేంద్రం సహకరించాలని డిమాండ్ చేశారు. దీక్షా శిబిరంలో వెంకటరావు, గంగాధర్, గోవిందు, గణేష్, దేముడు, సిహెచ్.సత్యనారాయణ, పెంటయ్య, లాంబ్రిడ్, సుమన్, ఎంఆర్‌కె.రావు తదితరులు పాల్గొన్నారు.