Jun 11,2023 00:41

కరపత్రం విడుదల చేస్తున్న నాగిరెడ్డి, ఉక్కు నిర్వాసిత సంఘ నాయకులు

ప్రజాశక్తి -గాజువాక : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రకటన చేయాలని ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు ముద్రించిన కరపత్రాలను శనివారం పెదగంట్యాడ జంక్షన్‌లో గాజువాక ఎమ్మెల్యే నాగిరెడ్డి ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురుమూర్తిరెడ్డి, ఉక్కు నిర్వాసిత సంఘం నాయకులు పులి రమణారెడ్డి, ఎల్లేటి శ్రీనివాసరావు, గొందేసి సత్యారావు, సిఐటియు నాయకులు కణితి అప్పలరాజు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగుపడతాయని 35 సంవత్సరాలు క్రితం తక్కువ రేటుకు రైతులు భూములు, ఇల్లు ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. 7 వేలకు పైగా ఆర్‌.కార్డుదారులు ఉక్కులో ఉపాధి కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇటీవల కాలంలో ప్రతినెలా 100 మందికి తగ్గకుండా ఉక్కు ఉద్యోగులు విరమణ పొందుతున్నారని గుర్తుచేశారు. వయో పరిమితి దాటిన ఆర్‌ కార్డుదారులు ఉన్నారన్నారు. మరో వైపు స్టీలుప్లాంట్‌ కార్మికులకు వేతన ఒప్పందం చేయకుండా ఏడున్నర సంవత్సరాలుగా తాత్సారం చేస్తున్నారన్నారు. ఆర్థికంగా ఉక్కు ఉద్యోగులను, వారి కుటుంబాలను దెబ్బకొట్టేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ ఉక్కుకు ఇవ్వాల్సిన నిధులు నిలిపి వేస్తూ, ముడి సరుకుల సరఫరా ఆపేయడంతో పాటు, ప్రధాన యూనిట్లను షట్‌డౌన్‌ చేస్తూ విశాఖ ఉక్కును దివాళా తీయించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. విశాఖ పర్యటనకు వస్తున్న అమిత్‌ షా స్టీలుప్లాంట్‌పై ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం పెదగంట్యాడ జంక్షన్‌లో జరప తలపెట్టిన ధర్నాలో ఉక్కు నిర్వాసితులు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని నిరసన తెలపాలని కోరారు.