Mar 05,2023 00:30

దీక్షలో కూర్చున్న కార్మికులు, పోరాట కమిటీ నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : త్యాగాలు, బలిదానాలతో ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టంచేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 751వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ టిపిపి, ఆర్‌ఇడి, పిఇఎం విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ, విదేశీ పెట్టుబడులు ఆహ్వానించదగ్గవే అయినా 32 మంది త్యాగాలు, బలిదానాలతో సాధించిన, రూ.లక్షల కోట్ల ఆస్తులు కలిగిన స్టీల్‌ప్లాంట్‌ను వదులుకోవాల్సిన అవసరం ఉందా?, పూర్తిస్థాయి ఉత్పత్తి దిశగా ప్లాంటును నడిపిస్తే వేలాది ఉద్యోగాలు ఇవ్వచ్చన్న సంగతి మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి విశాఖ ఉక్కును నష్టాలు బారిన నెట్టకుండా ఆపాలని, ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, ఏళ్ల తరబడి ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిర్వాసితులకు ఉపాధి కల్పించాలని, సొంతగనులు కేటాయించాలని, కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను దెబ్బకొట్టి మానసిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్న యాజమాన్యం పోకడలను నిలువరించే విధంగా కేంద్రంపై ఒత్తిడి చెయ్యాలని డిమాండ్‌చేశారు. ఈ దీక్షా శిబిరంలో పోరాట కమిటీ సభ్యులు వరసాల శ్రీనివాసరావు, బొడ్డు పైడిరాజు, ఎన్‌.రామారావు, సిహెచ్‌.సన్యాసిరావు, డి.శ్రీనివాస్‌, బి.అప్పారావు, మొల్లి వెంకటరమణ, కోరి అవతారం, జగ్గారావు మంత్రి గోపి, కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.