Apr 16,2023 22:52

సిఐటియు విశాఖ జిల్లా కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న జగ్గునాయుడు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తున్న నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేదుకు సన్నద్ధం కావాలని, దేశభక్తితో విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎం.జగ్గునాయుడు పిలుపునిచ్చారు. డాబాగార్డెన్స్‌లోని అల్లూరి సీతారామరాజు విజ్ఞానకేంద్రంలో సిఐటియు విశాఖ జిల్లా కౌన్సిల్‌ సమావేశం కె.ఎం.శ్రీనివాసరావు అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గునాయుడు మాట్లాడుతూ, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ నిలుపువేస్తున్నట్లు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ప్రకటన చేసి, అదే రోజు సాయంత్రానికి స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ప్రక్రియలో ఎటువంటి మార్పులేదని చెప్పారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమం ఫలితంగా బిజెపియేతర రాష్ట్రాలు మద్ధతు తెలియజేశాయని పేర్కొన్నారు. 2024 ఎన్నికల నేపథ్యంలో రాజకీయ లబ్ధికోసం బిజెపి మతం, కార్పొరేటీకరణ అంశాలను జోడించి ప్రజలపైన, కార్మికులపై దాడులకు పూనుకుంటుందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణపై కేంద్రం వైఖరి మారేవరకు ఉద్యమాన్ని ఉధృతం చేయాలన్నారు. అందుకు ఈ నెల 26న సాయంత్రం 4 గంటలకు గాజువాక లంకా గ్రౌండ్‌లో ఏర్పాటుచేసే భారీ సభను జయప్రదం చేయాలని కోరారు.
సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 5న చేపట్టిన ఛలో ఢిల్లీ కార్యక్రమంలో 10 లక్షల మంది కార్మికులు, కర్షకులు పాల్గొన్నారని, మన రాష్ట్రంలో అన్ని జిల్లా, మండల కేంద్రాలలో వందలాదిమందితో నిరసన కార్యక్రమాలు చేపట్టామని గుర్తుచేశారు. మేడేను పురష్కరించుకొని మే 1 నుండి 10 వరకు భారీఎత్తున సభలు, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా అల్లూరి విజ్ఞానకేంద్రంలో ఈ నెల 30న ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరిగే సాంస్కృతిక మేడే సంబరాల్లో కార్మికులు భాగస్వామ్యం కావాలన్నారు. మేడే అన్ని కార్మికవాడల్లోనూ, కార్మికుల నివాస ప్రాంతాల్లోనూ జరిపి మేడే ప్రాధాన్యతను తెలియజేయాలన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా ఉధృతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాలో ఉండే పబ్లిక్‌సెక్టార్‌ యూనియన్లు, రాష్ట్ర రంగాలు, అసంఘటితరంగ యూనియన్లు, వివిధ జోన్‌ల కౌన్సిల్‌ సభ్యులు హాజరయ్యారు.