ఎన్నో పోరాటాలు, త్యాగాలు ఫలితంగా ఏర్పాటైన వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి చెప్పడం దుర్మార్గమని, ఈ చర్యను తీవ్రంగా అడ్డుకుంటామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. విశాఖ నగరంలో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం సాగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారమూ కొనసాగాయి. ఆయా చోట్ల ప్రజలు, కార్మికులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - కలెక్టరేట్ : స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సిఐటియు గాజువాక జోన్ కార్యదర్శి ఎం.రాంబాబు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 477వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఐటియు గాజువాక జోన్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎనిమిదేళ్ల బిజెపి పాలనలో ప్రభుత్వ రంగంలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని, అటువంటప్పుడు ఈసరికే చక్కగా నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి వేయటం దుర్మార్గమని అన్నారు. బిజెపి విధానాలను ప్రజలంతా తీవ్రస్థాయిలో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. అన్ని కార్మిక, ప్రజా సంఘాల, రాజకీయ పక్షాల మద్దతుతో కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఎ.లోకేష్, వి.చిన్నారావు, ఎం.వెంకటరావు పాల్గొన్నారు.
ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద 526వ రోజుకు చేరుకున్న దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ - 2 ప్రతినిధులు, కార్మికులు కూర్చున్నారు. వారిని ఉద్దేశించి పోరాట కమిటీ ప్రతినిధి మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నేడు ప్రజలు, కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటి పరిష్కారం కోసం ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను బలపరచాలని అన్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి కార్మికులపై తీవ్ర నిర్బంధానికి దిగుతోందని విమర్శించారు. దీక్షా శిబిరంలో ఎస్‌ఎంఎస్ - 2 ప్రతినిధులు పివి.రమణమూర్తి, బి.అప్పారావు, ఎమ్‌వి.రమణ, రాజబాబు, జగదీష్, సుధీర్, సతీష్, సాయి, ఆర్.హరి కిషోర్ పాల్గొన్నారు.










