Dec 22,2022 00:05

దీక్షలో కూర్చున్న సిఎఫ్‌టియుఐ సంప్రదాయ మత్స్యకారులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్మించలేదని, అలాంటప్పుడు దానిని అమ్మే హక్కు ఎక్కడిదని సిఎఫ్‌టియుఐ సంప్రదాయ మత్స్యకారుల యూనియన్‌ నేత ఎం.లక్ష్మి ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 629వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో మత్స్యకార మహిళలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్టీల్‌ ప్లాంట్‌ కోసం భూములను సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన భూమిక పోషించిందని చెప్పారు. అటువంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా స్టీల్‌ప్లాంట్‌ను ఎలా అమ్ముతారని ప్రశ్నించారు. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ దీక్షల్లో కె.లక్ష్మి, మైలపల్లి ఎర్రమ్మ, కె.జగది, పి.దుర్గ, బి.లక్ష్మి, మైలపల్లి అప్పయ్యమ్మ, జి.లక్ష్మి, ఎస్‌. రమ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.