ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో నూతన వేతనాలు అమలుచేయాలని నూతన కార్మికులు ఆందోళన చేశారు. 2017 నుంచి నూతన వేతనాలు అమలు చేయాల్సి ఉన్నా తాత్సారం చేస్తుండంతో స్టీల్ ప్లాంట్ ఎల్ అండ్ డిసి జంక్షన్ వద్ద వందలాది మంది యువ కార్మికులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. గత సంవత్సరం ఎన్‌జెసిఎస్‌లో వేతన ఒప్పందం జరిగిందని, సెయిల్ కర్మాగారాలలో ఇప్పటికే వేతన ఒప్పందం అమలు జరిగి ఏడాది కావస్తుందని, విశాఖ ఉక్కులో మాత్రం అమలుకాలేదని తెలిపారు. ఇన్సెంటివ్‌లో కోత విధించడంతో కొత్త కార్మికులు ముందు ఉన్న జీతం కంటే తక్కువ అందుకుంటున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. ఉక్కు యాజమాన్యం స్పందించి వెంటనే పెరిగిన జీతాలను అమలు చేయాలని కోరారు. ఉక్కులో ఉన్న అన్ని యూనియన్‌లు వేతన ఒప్పందం త్వరితగతిన అయ్యేలా యాజమాన్యంపై ఒత్తిడి తేవాలని కోరారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ కాకుండా కాపాడుకోవడంతో పాటుగా కార్మికుల ఆర్థిక ప్రయోజనాలను కూడా కాపాడుకోవాలన్నారు. దీనికోసం భవిష్యత్తులో జరిగే ప్రతి కార్యక్రమానికీ యూనియన్‌లకతీతంగా యువకార్మికులు పాల్గోవాలని యువ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వందలాది యువ కార్మికులు వివిధ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.










