ప్రజాశక్తి-ఉక్కునగరం : జాతీయ ఇంధన పరిరక్షణ పక్షోత్సవాలను స్టీల్‌ప్లాంట్ లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్ సిఎమ్‌డి అతుల్ భట్ మాట్లాడుతూ, విశాఖ ఉక్కు ఇంధన పరిరక్షణలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రారంభం నుంచీ ఇందన సామర్థ్యం పొదుపులో ముందంజలో ఉందన్నారు. దేశంలోనే అత్యుత్తమ ఇంధన సామర్థ్యం ఉన్న ఉక్కు కర్మగారంగా గుర్తింపు పొందిందని తెలిపారు. కోక్ డ్రై క్విన్సింగ్, బిఎఫ్ టాప్ ప్రెజర్ రికవరీ, ఎల్డి గ్యాస్ రికవరీ తదితర వివిధ అధునాతన వ్యవస్థలలో వేస్ట్ హీట్ రికవరీ సిస్టమ్ ద్వారా స్టీల్ తయారీలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ క్లీనర్ టెక్నాలజీలను డిజైన్ దశలోనే ఆర్‌ఐఎన్‌ఎల్ ఇన్‌స్టాల్ చేసిందని తెలిపారు. నిర్దిష్ట శక్తి వినియోగాన్ని తగ్గించడానికి సాంకేతికత దోహద పడిందన్నారు. సిఐఐ ద్వారా నాలుగుసార్లు ఆర్‌ఐఎన్‌ఎల్ ప్రతిష్టాత్మక నేషనల్ ఎనర్జీ లీడర్ జాతీయ స్థాయి అవార్డు పొందడం అరుదైన విషయమని తెలిపారు. మరే ప్రభుత్వ రంగ సంస్థ వరుసగా నాలుగు సార్లు ఈ అవార్డును గెలుచుకోలేదని గుర్తు చేశారు. ఇందుకు ఎనర్జీ మేనేజ్‌మెంట్ విభాగాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సిజిడిలు, డైరెక్టర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లు, విభాగాధిపతులు, ఎగ్జిక్యూటివ్ అసోసియేషన్ సభ్యులు, ట్రేడ్ యూనియన్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అసోసియేషన్ల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.










