ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : ప్రభుత్వ రంగంలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ పూర్తిస్థాయిలో సమర్థవంతంగా పనిచేయడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణసాయంగా రూ.5 వేల కోట్లు ఇవ్వాలని షిప్‌యార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ఎస్.ప్రసాద్ కోరారు. స్టీల్ ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 787వ రోజుకు చేరాయి. దీక్షల్లో షిప్‌యార్డ్, బిహెచ్‌ఇఎల్ ఉద్యోగులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్ ప్లాంట్‌లో కొన్ని యూనిట్లను మూసివేస్తూ ఉద్దేశపూర్వకంగానే ఉత్పత్తిని తగ్గించేలా కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు సమకూర్చాలని డిమాండ్‌చేశారు. ఈ దీక్షల్లో బిహెచ్‌ఇఎల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జిటిపి ప్రకాష్, కె.నారాయణరెడ్డి, కె.ప్రభాకర్ మూర్తి పాల్గొన్నారు.










