స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకున్న 1800 ఎకరాల బదులు, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు అప్పజెప్పింది. 1800 ఎకరాల భూములు స్టీల్‌ప్లాంట్‌వి కాగా, వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. 'సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది' అన్న చందంగా మారింది. అదానీ గ్రూపు గంగవరం పోర్టు స్వాధీనం చేసుకోవడం వల్ల ఎగుమతి, దిగుమతుల టారిఫ్‌లు అడ్డగోలుగా పెంచుతారు. దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతి యేటా వందల కోట్లల్లో నష్టాలు వస్తాయి.
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సముద్రతీరం ఒక వరం. 1960వ దశకం వరకు ప్రపంచంలోనే స్టీల్‌ప్లాంట్‌లన్నీ గనులు, ఖనిజాలున్న ప్రాంతాల్లో నిర్మించేవారు. తరువాత కాలంలో సముద్రతీరంలో స్టీల్‌ప్లాంట్‌ల నిర్మాణం ఎగుమతి, దిగుమతులకు లాభకరంగా భావించారు. భారతదేశంలో ప్రథమంగా నిర్మించిన భిలారు, బొకారో, దుర్గాపూర్, రూర్కెలా స్టీల్‌ప్లాంట్‌లన్నీ ఇనుప ఖనిజం లభించే గనులకు దగ్గరలో నిర్మించబడ్డాయి. ఇవన్నీ ఉత్తర భారతదేశం లోనే వున్నాయి. 5వ భారీ స్టీల్‌ప్లాంట్ ఎక్కడ నిర్మించాలనే విషయాన్ని ఆంగ్లో అమెరికన్ కన్సార్టియం అనే అంతర్జాతీయ సంస్థకు కేంద్ర ప్రభుత్వం 1963లో అప్పగించింది. ఈ కన్సార్టియం దక్షిణ భారత దేశమంతటా పర్యటించి సముద్రతీరమున్న విశాఖపట్నంలో భారీ స్టీల్‌ప్లాంట్ నిర్మించాలని సిఫార్సు చేసింది. సహజ సిద్ధమైన గంగవరం పోర్టు లోతు అత్యధికం 21 మీటర్లు. అందువల్లే నేడు రెండు లక్షల టన్నుల సామర్ధ్యం కల్గిన పనామా షిప్‌లు ఇక్కడకు రాగలుగుతున్నాయి. అన్ని రకాలైన ఇనుము, బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్, ముడి పంచదార, అల్యూమినా వంటి అత్యంత విలువైన సరుకుల ఎగుమతి, దిగుమతులకు సులభతరమైంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్మాణంలో భాగంగా గంగవరం, దిబ్బపాలెం గ్రామాల నుంచి 1800 ఎకరాల భూ సేకరణ జరిగింది. ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు విశాఖ స్టీల్‌ప్లాంట్ కోసమని ఈ భూములను త్యాగం చేశారు. భారతదేశంలో ఏ స్టీల్‌ప్లాంట్‌కూ లేని సముద్రతీరం ఒక్క విశాఖ స్టీల్‌ప్లాంట్‌కే వుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు గంగవరం పోర్టు పక్కనే వుండడం ఒక వరం.
గంగవరం పోర్టును తరువాత కాలంలో బిజెపి, కాంగ్రెస్, టిడిపి లు ప్రయివేటు కంపెనీలకు అప్పగించడం స్టీల్‌ప్లాంట్‌కు శాపంగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వున్న కాలంలో డివిఎస్ కన్సార్టియం అనే ప్రయివేటు కంపెనీకి గంగవరం పోర్టును అప్పగించాలని సకల ప్రయత్నాలు చేశారు. కానీ కేంద్ర స్టీల్, నౌకాయాన, రక్షణ మంత్రిత్వ శాఖలు తీవ్రంగా వ్యతిరేకించాయి. స్టీల్‌ప్లాంట్ కోసం ఏర్పాటు చేయాల్సిన పోర్టును ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని స్టీల్ మంత్రిత్వశాఖ ముందు వ్యతిరేకించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ 1800 ఎకరాలను ప్రయివేటుకు ఇవ్వడాన్ని ఆనాటి స్టీల్‌శాఖ మంత్రి నవీన్ పట్నాయక్ తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు మంత్రిత్వ శాఖలు వ్యతిరేకించినా నిర్మాణ పనులకు కేంద్రం అనుమతించింది. పోర్టు నిర్మాణానికి విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సొంత నిధుల్లేవని ప్రయివేటు వారికి ఇవ్వాలని తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి చేసింది. అదే సమయంలో విశాఖ పోర్టు ట్రస్ట్, పోర్టు నిర్మాణానికి పూర్తి నిధులు సమకూర్చుతామని, తమకు పోర్టులు నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం పూర్తిగా వుందని, విశాఖ పోర్టుకు గంగవరం పోర్టు నిర్మాణ అవకాశం కల్పించాలని ఆనాటి విశాఖ పోర్టు ఛైర్మన్ గోపాలరావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే మేజర్ పోర్టు చట్ట ప్రకారం 200 కిలోమీటర్ల మధ్యలో వేరొక పోర్టు నిర్మించరాదు. అందువల్ల స్టీల్‌ప్లాంట్ శాటిలైట్ పోర్టు ఏర్పాటుకు విశాఖ పోర్టు ట్రస్టు నిర్మిస్తామని తెలియజేశారు. విశాఖపట్నం తూర్పు సముద్రతీరం ముఖద్వారం లాంటిది. భారత తూర్పు నావికాదళ కమాండెంట్ కేంద్ర ప్రధాన కార్యాలయం పక్కనే వున్న గంగవరం పోర్టును ప్రయివేటుకు ఇవ్వడం నాటి రక్షణశాఖ మంత్రి జార్జిఫెర్నాండేజ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. తెలుగుదేశానికి చెందిన ఏడుగురు క్యాబినెట్ మంత్రులుగా కేంద్ర ప్రభుత్వంలో ఆనాడు భాగస్వాములుగా వున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...ప్రధాన మంత్రి వాజ్‌పేయి మెడపై కత్తి పెట్టి కేంద్ర ప్రభుత్వ శాఖలను ఒప్పించారు. ప్రధాని వాజ్‌పేయి ప్రయివేటు పోర్టుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చారు. కేంద్ర బిజెపి చట్టాలను ఉల్లంఘించి అనుమతులివ్వడం ద్వారా విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తీరని అన్యాయం జరిగింది. ఆనాడు బిజెపి, తెలుగుదేశం ప్రభుత్వాలు చేసిన ద్రోహం ఫలితంగా 2004లో గంగవరం పోర్టు ప్రయివేటుపరమైంది. కానీ స్వాధీనం చేసేలోగానే ఎన్నికలు రావడంతో చంద్రబాబు ప్రభుత్వం కూలిపోయింది. తరువాత అధికారంలోకి వచ్చిన వై.ఎస్.రాజశే ఖరరెడ్డి ప్రభుత్వం కె.వి.పి రామచంద్రరావు ద్వారా డి.వి.ఎస్.రాజు ప్రయి వేటు కంపెనీకి గంగవరం పోర్టు నిర్మాణ అనుమతులు వచ్చాయి. తెలుగుదేశం, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ పోర్టు యాజమాన్యం దగ్గర పెద్దఎత్తున కమీషన్లు పుచ్చుకున్నాయని ఆనాడు ప్రచారం సాగింది. గంగవరం ప్రయివేటు పోర్టు నిర్మాణాన్ని స్థానిక ప్రజలు, మత్స్యకారులు వ్యతిరేకించారు. ఆర్నెల్లు పోర్టు నిర్మాణ పనులు జరగకుండా అడ్డుకున్నారు. వామపక్షాలు, సిఐటియు తీవ్రంగా ప్రతిఘటించాయి.
2006 మార్చి 27న ఉదయం ఆరు గంటలకు అకారణంగా గంగవరం గ్రామంలో ప్రభుత్వం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో మత్స్యకారుడు చోడిపల్లి నూకరాజు ప్రాణాలు కోల్పోయాడు. 47 మంది నాయకులపై అక్రమ కేసులు బనాయించి నెల రోజులు సెంట్రల్ జైల్లో వుంచారు. నాయకులు జైల్లో వుండగా రాజశేఖరరెడ్డి ప్రభుత్వం...డి.వి.ఎస్. రాజు కంపెనీకి భూములను కట్టబెట్టింది. స్టీల్‌ప్లాంట్ నుంచి తీసుకున్న 1800 ఎకరాల బదులు, రాష్ట్ర ప్రభుత్వానికి 10.4 శాతం వాటాలు అప్పజెప్పింది. 1800 ఎకరాల భూములు స్టీల్‌ప్లాంట్‌వి కాగా, వాటాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరింది. 'సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది' అన్న చందంగా మారింది. అదానీ గ్రూపు గంగవరం పోర్టు స్వాధీనం చేసుకోవడం వల్ల ఎగుమతి, దిగుమతుల టారిఫ్‌లు అడ్డగోలుగా పెంచుతారు. దీనివల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు ప్రతి యేటా వందల కోట్లల్లో నష్టాలు వస్తాయి.
పాలక వర్గాల నిర్ణయాలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు తీరని హానికరంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ 2021 జూన్ 8న గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాలు 10.4 శాతం అదానీ గ్రూపుకు రూ. 645 కోట్లకు అమ్మాలని నిర్ణయించింది. ఈ పోర్టును స్పెషల్ ఎకనామిక్ జోన్‌గా మార్చడానికి కూడా అనుమతించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం. గంగవరం పోర్టు లోని డి.వి.ఎస్.రాజు కుటుంబం నుంచి 58.1 శాతం వాటాలను రూ. 3604 కోట్లకు, వార్బర్గ్ పిన్కర్స్ అనే విదేశీ కంపెనీ నుంచి 31.5 శాతం వాటాలను రూ.1954 కోట్లకు...ఈ ఏడాది మార్చిలో అదానీ గ్రూపు బలవంతంగా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడితో లాక్కొన్నది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముందు ప్రయివేటు పోర్టులను, తరువాత ప్రభుత్వ రంగ పోర్టులన్నింటినీ బలవంతగా లాక్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా సహకరిస్తున్నది. మేజర్ పోర్టు, మైనర్ పోర్టుల చట్టాలను మార్చింది. దేశంలోనే అత్యంత విలువైన అనేక కీలక భారీ పరిశ్రమలను కారుచౌకగా అదానీ, అంబానీలకు కట్టబెడుతోంది. ఈ కోవ లోనే ఎయిర్ పోర్టుల నిర్వహణలో అనుభవం లేని అదానీ గ్రూపుకు ఐదు ఎయిర్ పోర్టులను గత సంవత్సరం కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం అప్పగించింది. గంగవరం పోర్టు అదానీ గ్రూపుకు అప్పగించడంతో విశాఖ పోర్టు ట్రస్ట్‌ను పోటీలో కేంద్ర ప్రభుత్వం అణచివేస్తున్నది. అదానీకి లాభాలు చేకూర్చుతోంది. అదానీ గ్రూపు రావడం...విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు, రాష్ట్ర ప్రయోజనాలకు తీరని హానికరం.
/ వ్యాసకర్త సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సెల్ 9490098789 /
సిహెచ్. నర్సింగరావు











