Jul 19,2023 00:25

ధర్నాలో పాల్గొన్న సిపిఎం కార్పొరేటర్‌ గంగారావు తదితరులు

ప్రజాశక్తి -గాజువాక : స్టీల్‌ప్లాంట్‌కు రెండు షిప్పులో అదాని గంగవరం పోర్టుకు వచ్చిన బొగ్గును అన్‌లోడ్‌ చేయకుండా నిలిపేయడాన్ని నిరసిస్తూ, పోర్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పోర్టుకు ఆనుకొని ఉన్న గాంధీ విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యాన మంగళవారం పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు మాట్లాడుతూ, అదాని గంగవరం పోర్టు బరితెగించి వ్యవహరిస్తోందని విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో గంగవరం పోర్టు 2011లో చేసుకున్న ఒప్పందం 2026 వరకు ఉందని, దాన్ని ఉల్లంఘించి రూ.50 కోట్లు బకాయి ఉందని సరుకు నిలుపుదల చేసిన యాజమాన్యంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 1400 ఎకరాల భూమిని గంగవరం పోర్టు తీసుకుందని, వాస్తవానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు ఒక బెర్త్‌ను కూడా కేటాయించాల్సి ఉందని తెలిపారు. వీటిని పరిగణలోకి తీసుకోకుండా సరుకు ఎలా నిలుపుదలచేస్తారని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అండతో అదానీ రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నిద్ర లేవాలని కోరారు. మాజీ పోలీసు ఉన్నతాధికారులను పోర్టులో నియమించుకొని పోలీసు రాజ్యం చలాయించాలని చూస్తే విశాఖ కార్మిక వర్గం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. బొగ్గును వెంటనే దించాలని, లేకుంటే పోర్టు గేట్లను పగులగొట్టి లోపలికి వెళ్తామని యాజమాన్యాన్ని హెచ్చరించారు. గంగవరం పోర్టు అదానీ స్వాధీనం అయ్యాక ఛార్జీలు విపరీతంగా పెంచేశారన్నారు. స్టీల్‌ప్లాంట్‌కు సంబంధించి పాత ఒప్పందం ప్రకారమే చార్జీలు ఉంచాలని కోరారు. కుకింగ్‌ కోల్‌ నిలుపుదల చేసి స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తికి ఆటంకం కలిగించాలనే దుర్మార్గమైన ఆలోచనతో అదానీ గంగవరం పోర్టు బిజెపి అండతో రెచ్చిపోతుందన్నారు.
అదానీ గంగవరం పోర్టులో పనిచేస్తున్న కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్‌చేశారు.
సిపిఎం స్టీల్‌ డివిజన్‌ కార్యదర్శి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, బీసీ రోడ్డు వంతెనను పోర్టు నిర్మించకుండా స్టీల్‌ ప్లాంట్‌ నిధులతోనే నిర్మించిన విషయాన్ని గుర్తుచేశారు. కొద్ది మొత్తంలో బాకీ ఉందని చెప్పి సరుకు దిగుమతి చేయకుండా ఉంచడం తగదన్నారు. సిపిఎం నాయకులు బైరెడ్డి గుర్రప్ప మాట్లాడుతూ, అదానీ గంగవరం పోర్టులో రోజువారి కూలీలకు రూ.200 మాత్రమే చెల్లిస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారని విమర్శించారు. కొవిరి అప్పలరాజు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ నాయకులు జి.శ్రీనివాసరావు, నమ్మి రమణ, స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి, పాల అప్పలరెడ్డి, గంగాధర్‌ పాల్గొన్నారు.