ప్రజాశక్తి - గ్రేటర్ విశాఖ బ్యూరో/ ఉక్కునగరం : పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యులైన కేరళ పరిశ్రమల శాఖా మాజీ మంత్రి, ప్రస్తుత సిపిఎం ఎంపీ, సిఐటియూ ఆలిండియా జనరల్ సెక్రటరీ ఎలమరం కరీం విశాఖకు శుక్రవారం విచ్చేశారు. శనివారం జరిగే ప్రభుత్వ రంగ సంస్థల విజిట్‌లో కమిటీతో పాటు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్టులో స్టీల్‌ప్లాంట్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు జే అయోధ్యారాం ఆయన్ను కలిసి స్టీల్‌ప్లాంట్ పరిస్థితిని వివరించారు. ఈనెల 4 (ఆదివారం ) ఉదయం 9గంటలకు స్టీల్‌ప్లాంట్ కూర్మన్నపాలెం కార్మిక శిబిరం వద్దకు కరీం విచ్చేయనున్నారని, కార్మికుల నుద్దేశించి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రసంగించనున్నారని జే అయోధ్యారాం తెలిపారు. స్టీల్‌ప్లాంట్ ను కేంద్రంలోని బిజేపి సర్కారు ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెట్టాలని చూసే క్రమంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఉక్కు కార్మికులు తమ ఆవేదనను వెల్లబుచ్చనున్నారు. 562 రోజులకు పైబడి స్టీల్ కార్మికులు ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే.










