Jul 21,2022 23:22

సమావేశంలో మాట్లాడుతున్న సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నర్సింగరావు

  ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి సిద్ధం కావాలని రాష్ట్ర సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ సిడబ్ల్యూసి-2 (ఆంధ్రకేసరి)లో ఏర్పాటుచేసిన సిఐటియు రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక పోరాటాలతో, త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కును కేంద్రంలోని బిజెపి తన సొంత ఆస్తిగా అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. పార్లమెంటు సాక్షిగా మంత్రులు రోజుకో ప్రకటనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. స్టీల్‌ప్లాంట్‌లో కేంద్రం పెట్టిన పెట్టుబడి కంటే అత్యధికంగా తిరిగి చెల్లించిందని తెలిపారు. విశాఖలో గతంలో ఉన్న హిందుస్థాన్‌ జింక్‌ పరిశ్రమను ప్రయివేటీకరించిన తర్వాత జరిగిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో వివిధ నగరాలతో పోలిస్తే విశాఖలో ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఉండడం వల్లనే అభివృద్ధి సాధ్యమైందని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా ప్రయివేట్‌ పరిశ్రమల స్థాపన ద్వారా అభివృద్ధి జరిగిందని ఈ పాలకులు నిరూపించగలరా సవాల్‌ విసిరారు. ప్రయివేటు పరిశ్రమలకు రాయితీలు, రుణమాఫీలు చేయడమే బిజెపి వారికి అభివృద్ధిగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ గత సంవత్సరం రూ.500 కోట్లను ప్రభుత్వానికి డివిడెంట్‌ గాను, జీఎస్టీ రూపంలోనూ కట్టిన విషయాన్ని గుర్తు చేశారు. మన రాష్ట్ర హక్కును, రాష్ట్ర అభివృద్ధిని నాశనం చేస్తున్న బిజెపికి మద్దతు తెలుపుతున్న రాష్ట్రంలోని మూడు పార్టీలు ఒకసారి ఆలోచించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలోని మూడు పార్టీలు ప్రజా ఉద్యమాలకు మద్దతుతో పాటు స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని, తద్వారా కేంద్రానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశాలలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శులు సుబ్బరామమ్మ, డిఎన్‌విడి.ప్రసాద్‌, ఎం.జగ్గునాయుడు, స్టీల్‌ప్లాంట్‌ సిఐటియు గౌరవాధ్యక్షులు డాక్టర్‌ బి.గంగారావు, సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కెఎమ్‌.శ్రీనివాస్‌, ఆర్‌కెఎస్‌వి.కుమార్‌ వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.