ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం అవసరమైతే త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని విశాఖ ఉక్కు సాధకులు తమనంపల్లి అమృతరావు కుటుంబ సభ్యులు శాంతయ్య, తమనంపల్లి ఫ్రాన్సిస్స్, తమనంపల్లి రవి, తమనంపల్లి కృప తెలిపారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం వారం నాటికి 544వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో ప్లాంట్ డబ్ల్యూఆర్‌ఎం-1,2 విభాగాల కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షా శిబిరాన్ని తమనంపల్లి శాంతయ్య కుటుంబ సభ్యులు సందర్శించి ఉక్కు పోరాటానికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శాంతయ్య మాట్లాడుతూ, తమ తాత విశాఖ ఉక్కు సాధన కోసం నిరవధిక నిరాహార దీక్ష చేశారని, పోరాటాలకు ప్రజలు, స్వతంత్ర సమరయోధులు, ఉద్యమకారులు సహకారం అందించడంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించారని తెలిపారు. ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను కారుచౌకగా అదానీ, అంబానీలకు బిజెపి ప్రభుత్వం అమ్మాలని ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. తమ తాత ఈ ప్రాంతవాసి కాకపోయినా విశాఖపట్నం సముద్రతీరంలో ఉక్కు పరిశ్రమ వస్తే పెద్ద పరిశ్రమగా అవతరిస్తుందని, రాష్ట్రానికి దేశానికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయని, ముఖ్యంగా రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని బలమైన ఆకాంక్షతో గుంటూరు నుంచి వచ్చి ఉద్యమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే ఉక్కు సత్యాగ్రహ దీక్షలో అమృతరావు కుటుంబం తరపున తాము పాల్గొంటామని తెలిపారు. పోరాట కమిటీ నాయకులు వరసాల శ్రీనివాసరావు, కె.పరందామయ్య, సంపూర్ణం మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటించాలని, లేకుంటే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యు.విజరు, యూనియన్ ప్రతినిధులు కె.తిరుపతిరాజు, వి.మురళి, కె.భాస్కర్, అన్నయ్య శ్రీనివాస్, లింగరాజు పాల్గొన్నారు.










