Aug 02,2022 00:15

దీక్షలో కూర్చున్న సిఎఫ్‌టియుఐ నాయకులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : లక్షల కోట్ల విలువచేసే ప్రభుత్వ రంగ సంస్థల రూపంలో ఉన్న ప్రజా సంపదను, పాలకులు కారు చౌకగా తమ అనుయాయులకు ధారాదత్తం చేయడం, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాలలో ఒకటైన సోషలిజానికి వ్యతిరేకమని, ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రయివేటీకరణపై సమీక్షించాలని సిఎఫ్‌టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్‌.కనకారావు విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 487వ రోజుకు చేరాయి. దీక్షల్లో సిఎఫ్‌టియుఐ మహిళలు కూర్చున్నారు. ఈ సందర్భంగా కనకారావు మాట్లాడుతూ, ప్లాంట్‌కు అవసరమైన 26 వేల ఎకరాల భూమి సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నారు. కనుక రాష్ట్రప్రభుత్వం ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్‌ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.లక్ష్మి, ఎం.లక్ష్మి, లండా ఎర్రమ్మ, పి.దుర్గ, కె.గౌరి, ఎ.లక్ష్మి, రఘు, బాలు తదితరులు పాల్గొన్నారు.