ప్రజాశక్తి - ఆరిలోవ : 'విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఆపండి' అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ జెఎసి కన్వీనర్ ప్రియాంక దండి ఆధ్వర్యాన తోటగరువు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ఆదివారం ప్రజలతో రాష్ట్రపతికి లేఖలు రాయించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రియాంక దండి మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు భూములిచ్చిన సుమారు 800 మందికి ఉద్యోగాలు ఇవ్వకుండానే ప్రయివేటీకరణ చేయడం అన్యాయమన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 14, 19, 21 హక్కులు కాాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్ట్రేటజిక్ సేల్ నిర్ణయాన్ని ఆపాలని రాష్ట్రపతికి ప్రజలతో లేఖలు రాయిస్తున్నామన్నారు. ప్రజలు స్వచ్చందంగా వచ్చి లేఖలు రాస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు, ఆంధ్రల హక్కు నినాదంతో సంపాదించుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించకుండా చేస్తున్న ఉద్యమంలో తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసిపి సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల స్వయంగా పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెఎసి సభ్యులు జగన్ మురారీ, నుశ్చల్, నాగరాజు, హర్ష తదితరులు పాల్గొన్నారు.










