ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటుపరం కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అడ్డుకోవాలని సిఐటియు పెందుర్తి జోన్ కార్యదర్శి జి.శంకరరావు డిమాండ్‌చేశారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 623వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు పెందుర్తి జోన్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ మిగిలు భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్‌రెడ్డిపైనే ఉందన్నారు. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన స్టీల్ ఉత్పత్తి చేస్తున్న విశాఖ స్టీల్ కర్మాగారం, మరింత లాభాల్లో నడవడానికి సొంత గనులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.అప్పారావు, కె.ముత్యాలు, పి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.










