Dec 30,2022 00:09

దీక్షలో నినదిస్తున్న ఐద్వా సభ్యులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని ఐద్వా విశాఖ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.పద్మ, వై.సత్యవతి స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 637వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో ఐద్వా నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు వెనుక 32 మంది బలిదానం ఉందన్నారు. 22 వేల ఎకరాల భూములను రైతులు త్యాగం చేశారని తెలిపారు. ప్రస్తుతం లాభాల్లో నడుస్తున్న ఈ కర్మాగారానికి అవసరమైన సొంత గనులను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుగొమ్మలు అయిన ప్రభుత్వ రంగ సంస్థలను నాశనం చేయడం బిజెపి పాలకులకు తగదన్నారు. ఈ దీక్షల్లో ఐద్వా నాయకులు ఆర్‌.విమల, బొట్టా ఈశ్వరమ్మ, కె.మణి, బి.సత్యవతి, డి.కొండమ్మ, కె.కుమారి, గౌరి, శారద తదితరులు పాల్గొన్నారు.