Oct 18,2022 23:50

దీక్షలో కూర్చున్న వైఎస్‌ఆర్‌టియు కార్మికులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయటం దుర్మార్గమని, ఈ చర్యను అడ్డుకుంటామని వైఎస్‌ఆర్‌టియు జిల్లా కార్యదర్శి ఆర్‌.అనీల్‌ అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక సంఘాల జెఎసి ఆధ్వర్యాన చేపట్టిన దీక్షలు మంగళవారం నాటికి 565వ రోజుకు చేరాయి. దీక్షల్లో వైఎస్‌ఆర్‌టియు హెచ్‌పిసిఎల్‌ కాంట్రాక్టు కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా అనీల్‌ మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయవద్దంటూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా చేసిన తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని కోరారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే కార్మిక సంఘాల ఐక్యతతో అడ్డుకుంటామని హెచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేయలేదని, అటువంటప్పుడు అమ్మే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. దీక్షల్లో ఎస్‌.ఉమామహేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, అనీల్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.