Aug 24,2022 00:00

దీక్షల్లో కూర్చున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకుంటామని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి జి.అప్పలరాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారానికి 509వ రోజుకు చేరాయి. దీక్షల్లో విశాఖ ఆటో రిక్షా కార్మిక సంఘం (సిఐటియు) కార్యకర్తలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 30 వేల మంది ఉపాధి పొందుతుండగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి లభిస్తోందన్నారు. స్టీల్‌ సిటీగా విశాఖ పేరు పొందటానికి ప్రతీకగా నిలిచిన విశాఖ స్టీల్‌కు అవసరమైన సొంత గనులను కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోవడం దుర్మార్గమన్నారు. కార్యక్రమంలో ఆటో రిక్షా కార్మిక సంఘం కార్యదర్శి పి.రాజ్‌కుమార్‌, పి.మురళి కుమార్‌, శ్యాంసన్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.