Jul 21,2022 23:16

దీక్షలో కూర్చున్న సిఎఫ్‌టియుఐ మహిళలు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : ప్రభుత్వ రంగంలో లాభాలలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని సిఎఫ్‌టియుఐ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి కె.లక్ష్మి స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 476వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలలో సిఎఫ్‌టియుఐ మహిళలు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విశాఖ ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ప్రభుత్వ భూమితో సహా చిన్న, సన్న కారు రైతుల నుంచి 22 వేల ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే, కంద్ర ప్రభుత్వం కేవలం రూ.5 వేల కోట్లు పెట్టుబడితో 3.4 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ కలిగిన స్టీల్‌ప్లాంట్‌ ను నిర్మించి, నిర్వహిస్తుందన్నారు. కార్మికుల శ్రమతో వచ్చిన లాభాలు, బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి ప్రస్తుతం 7.3 మెట్రిక్‌ టన్నుల స్థాయికి ప్లాంట్‌ విస్తరించబడిందన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వంతో, సహా 22 వేల ఎకరాల భూములను సేకరించి ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధాన స్టేక్‌ హోల్డర్‌గా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం లేకుండా స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ అంశాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లక్షల కోట్ల విలువైన స్టీల్‌ప్లాంట్‌ను కేంద్ర పాలకులు కారు చౌకగా తమ అనుయాయులకు దారాదత్తం చేయడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం. లక్ష్మి, ఎం.దివ్య, కె.గౌరి, పి.దుర్గ, ఎ.లక్ష్మి పాల్గొన్నారు.