ప్రజాశక్తి, ఎంవిపి కాలనీ : విశాఖ స్టీల్‌ప్లాంట్ యొక్క 4 వేల ఎకరాల భూమి రాష్ట్ర ప్రభుత్వానికి కావాలని ఇటీవల స్టీల్ మంత్రిత్వశాఖ నిర్వహించిన డ్యాష్ బోర్డు సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలొస్తున్నాయని, దీనిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తోందని పార్టీ విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు పేర్కొన్నారు. మద్దిలపాలెంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌కు చెందిన 4 వేల ఎకరాలు భూమి ప్రతిపాదించటంపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్‌చేశారు. కేంద్ర స్టీల్ మంత్రి నిర్వహించే డాష్‌బోర్డు సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎందుకు హాజరతున్నారో ప్రభుత్వం తెలియజేయాలని కోరారు. ఇప్పటికే కేంద్రంలోని బిజెపి సర్కారు టాటా స్టీల్, జెఎస్‌డబ్ల్యు, అదానీ, పోస్కో గ్రూపులతో ప్రీ-బిడ్డింగ్ సంప్రదింపులు నిర్వహించినట్లు, కంపెనీ వాల్యుయేషన్‌ను కూడా రహస్యంగా పూర్తిచేయడానికి కుట్రపన్నిందని వార్తలు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆమోదంతోనే నరేంద్రమోడీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్ 100శాతం వాటాలను అమ్మటానికి చక చకా పావులు కదుపుతున్నట్లు ఈ వార్తలు రుజువు చేస్తున్నాయని పేర్కొన్నారు ఒక వైపు స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకమంటూనే రెండోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో మిలాఖత్ అయి ప్లాంట్ అమ్మకానికి అంగీకరించటం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమేనన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని విశాఖకు రప్పించి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకంపై ప్రకటన చేయించలేకపోయారని విమర్శించారు. వారం రోజుల క్రితం దీపం సెక్రటరీ ప్లాంట్‌ను అమ్మి తీరుతామని ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. రెండోవైపు ఉక్కు ఉద్యమంలో చీలికలు తీసుకురావడానికి బిజెపి ఎంపీ జవిఎల్ నర్సింహరావును విశాఖకు ప్రత్యేకంగా నరేంద్రమోడీ పంపించారని తెలిపారు. ప్లాంట్‌ను వేగంగా అమ్మటానికి, ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవటానికి ఉక్కు ఉన్నతాధికారులతో చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ఉక్కు మంత్రిని కలిసి మెమోరాండాలు ఇవ్వడం, పార్లమెంటులో ప్రశ్నలు లేవనెత్తడం తదితరాలన్నీ స్టీల్ ప్లాంట్ అమ్మకంకోసమే ఒక కుట్రతో చేస్తున్నారని విమర్శించారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్‌ను తీవ్ర నష్టాలు పాల్జేయడానికి కేంద్ర బిజెపి సర్కార్ స్టీల్ ఉత్పత్తిని 50శాతం తగ్గించేసిందని, బ్లాస్ట్‌ఫర్నెస్‌ను మూసివేసిందని, బొగ్గు సరఫరాకు ఆటంకాలు కల్పించిందని తెలిపారు. ఈ ఏడాది ప్లాంట్‌కు రూ.3వేల కోట్ల పైబడి నష్టాలు తీసుకురావాలని బిజెపి కుట్రతో వ్యవహరిస్తోందని విమర్శించారు. నష్టాలు తీసుకొచ్చి విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించి అమ్మేయాలనే వ్యూహత్మక కుట్ర ఇందులో దాగి ఉందన్నారు. ఇంత దారుణం జరుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించటం లేదంటే ఇవన్నీ ఆయన ఆమోదంతోనే జరుగుతున్నాయని అర్థం చేసుకోవచ్చన్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దీపం సమావేశాలకు హాజరవుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా స్టీల్‌ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు తక్షణం అన్ని రాజకీయపక్షాలను సమావేశపర్చాలని, ప్రధానమంత్రిని అఖిలపక్ష పార్టీలతో కలవాలని కోరారు. ప్లాంట్‌ను విక్రయించే చర్యలను ఉపసంహరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కెఎం.శ్రీనివాస్ పాల్గొన్నారు.










