Sep 25,2023 00:33

ఉక్కు దీక్షలో పాల్గొన్న సిఐటియు కాంట్రాక్టు కార్మికులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వం చేసినది రాజకీయ నిర్ణయమని, దానిని రాజకీయంగానే తిప్పికొట్టాలని స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ పూర్వ గౌరవాధ్యక్షులు శ్రీనివాసరాజు పిలుపునిచ్చారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలో చేపట్టిన దీక్షలు ఆదివారం నాటికి 955వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ అధ్యక్షతన కార్మికులు కూర్చున్నారు. శిబిరాన్ని ఉద్దేశించి శ్రీనివాసరాజు మాట్లాడుతూ, 955 రోజులుగా స్టీల్‌ కార్మికవర్గం చేస్తున్న పోరాటం ద్వారా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణకు ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోగలిగామన్నారు. రాష్ట్ర ప్రజానీకం ద్వారా రాష్ట్రంలోని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తేవాలని, రాబోయే ఎన్నికల్లో స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగించడానికి చిత్తశుద్ధితో నిలబడిన వారికే భవిష్యత్తు అన్న విధంగా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. భారత్‌ బచావో సంస్థ ప్రతినిధులు శిబిరానికి వచ్చి పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఆప్‌ ప్రతినిధులు శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో టిపిపి కాంట్రాక్టు కార్మికులతోపాటు నాయకులు ఒవి.రావు, ఎ.శ్రీనివాస్‌, ఆర్‌టి.రాజు, బండి అప్పలరాజు పాల్గొన్నారు. పోరాటకమిటీ నాయకులు డి.ఆదినారాయణ, కెఎస్‌ఎన్‌, నీరుకొండ రామచంద్రరావు, ఎ.వల్లీ, శరత్‌, బొడ్డు పైడిరాజు శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు.