ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో నడుస్తున్న విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తగు చర్యలు చేపట్టి కాపాడాలని హెచ్‌పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్‌టియుసి) అధ్యక్ష కార్యదర్శులు వై.నర్సింగరావు, ఎస్.తాతబాబు విజ్ఞప్తి చేశారు. స్టీల్‌ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 524వ రోజుకు చేరాయి. దీక్షల్లో హెచ్‌పిసిఎల్ కాంట్రాక్ట్ వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా కార్మికులు, ప్రజాసంఘాలు, బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయని చెప్పారు. అయినా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గటం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చొరవ తీసుకొని రాష్ట్రంలోని అన్ని పార్టీల నాయకులను ప్రధాని వద్దకు తీసుకెళ్లి స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.










