ప్రజాశక్తి - కలెక్టరేట్ : ప్రభుత్వ రంగంలో ఎంతో చక్కగా, లాభాలతో నడుస్తున్న వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమని సిఐటియు మధురవాడ జోన్ కార్యదర్శి బి.అప్పలరాజు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయ వేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు శుక్రవారానికి 505 రోజుకు చేరాయి. దీక్షల్లో సిఐటియు మధురవాడ జోన్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా చేపట్టిన ఉద్యమంలో అన్ని తరగతుల ప్రజలు పాల్గొంటున్నారని చెప్పారు. అన్ని రాజకీయ పక్షాలు, కార్మిక, ప్రజా సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నాయని తెలిపారు. దీనిని గుర్తించి కేంద్రం స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో వెనక్కు తగ్గాలన్నారు. లేకుంటే ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. దీక్షల్లో కుప్పిలి సింహాద్రి, ఆసి గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










