ప్రజాశక్తి-కంచరపాలెం : స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయబోమని, ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రధానమంత్రి మోడీ విశాఖలో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జివిఎంసి 52వ వార్డు పరిధి ఎన్‌ఎడిలో సిఐటియు ఆధ్వర్యాన శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఒ.అప్పారావు మాట్లాడుతూ, విశాఖకు గుండెకాయ లాంటి స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామనడం దుర్మార్గమన్నారు. స్టీల్‌ప్లాంట్ రక్షణ కోసం పోరాడుతున్న వారిని జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయడం అన్యాయం అన్నారు. ప్రధానితో ప్రకటన చేయించాల్సిన ముఖ్యమంత్రి ఆ పని చేయకపోగా శాంతియుతంగా పోరాడేవారిని అరెస్టులు చేయడం మోడీకి లొంగిపోవడమేనని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ప్రధానిని కలిసి స్టీల్‌ప్లాంట్ కోసం మోడీపై ఒత్తిడి తీసుకురాలేదని, ప్రజలకు ఆయన సందేశం ఇచ్చినట్లని ప్రశ్నించారు. ఇప్పటికైనా జగన్, పవన్, చంద్రబాబులు తమ స్వార్థపు రాజకీయాలు విడనాడి విశాఖకు వెన్నెముక లాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మహేశ్వరి, అప్పలరాజు, బాబూరావు, నర్సియమ్మ తదితరులు పాల్గొన్నారు.










