Aug 04,2022 00:17

దీక్షలో కూర్చున్న ఐఎన్‌టియుసి కార్మికులు

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటీకరణ చేయలనే నిర్ణయాన్ని బిజెపి ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఐఎన్‌టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 489వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్థలను అదాని, అంబానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేస్తోందని విమర్శించారు. రిజర్వేషన్లు ఎత్తివేసి బడుగు, బలహీన వర్గాల వారికి ఉపాధి లేకుండా చేస్తోందని పేర్కొన్నారు. కార్మికుల శ్రమతో లాభాల్లో నడుస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు బొగ్గును కేటాయించకుండా నిర్వీర్యం చేసే చర్యలను బిజెపి ప్రభుత్వం చేపట్టిందని ఆరోపించారు. స్టీల్‌ప్లాంట్‌కు నష్టాలు వచ్చేలా ప్రభుత్వంతో పాటు యాజమాన్యం కూడా కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఈ నెల 14వ తేదీతో నిరాహార దీక్షలు 500 రోజులకు చేరుకుంటాయని, ఈ సందర్భంగా అన్ని కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. జెఎసి వైస్‌ చైర్మన్‌ పడాల రమణ శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్‌టియుసి నాయకులు ఎస్‌. తాతబాబు, వై. నరసింగరావు, ఎం. హరి, జె.శ్రీను, ఎస్‌కె కన్నా, గోవింద, పి.రవి, రాజశేఖర్‌ పాల్గొన్నారు.