Oct 30,2023 00:50

ర్యాలీ చేస్తున్న శిష్టకరణాల అసోసియేషన్‌ నాయకులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమని కూర్మన్నపాలెం శిష్ట కరణాల అసోసియేషన్‌ కార్యదర్శి డి.సత్యారావు చెప్పారు. ఉక్కు ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకుంటున్న నేపథ్యంలో నవంబర్‌ 8న చేపట్టనున్న ఉద్యమంలో పాల్గొనాలని కోరుతూ కూర్మన్నపాలెంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ కారణంగానే విశాఖ అభివృద్ధి చెందిందని, అన్ని వర్గాల వారికి ఉపాధి లభిస్తోందని తెలిపారు. ప్లాంట్‌కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ఇంకా పూర్తి స్తాయిలో ఉపాధి లభించలేదని, వీరికి ఉపాధి కల్పించి న్యాయం చేయాలని డిమాండ్‌చేశారు. అధ్యక్షుడు పిఎస్‌విఎన్‌.గోపాల్‌ మాట్లాడుతూ, కూర్మన్నపాలెం శిష్ట కరణాల సంఘం సభ్యులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రతినిధులు కె.రవీంద్ర, గర్భం నాగేశ్వరరావు, డబ్బీరు గురునాధరావు, డి.కృష్ణారావు, మానాపురం శ్రీనివాస పట్నాయక్‌, శేఖరమంత్రి వరలక్ష్మి, రామచంద్రరావు, ప్రసాదరావు, వెంకటేశ్వరరావు, గోపాలకృష్ణ, బివిఎం.కృష్ణ పాల్గొన్నారు.