విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గుత్తపెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఉత్తరాంధ్రలో మోటార్ సైకిల్ యాత్ర చేపట్టింది. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం బైక్‌జాత ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు విజయనగరం జిల్లా కేంద్రానికి చేరనుంది. 6గంటలకు బాలాజీ జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించ నున్నారు. రాత్రికి నగరంలోని బసచేస్తారు. జాతాలో కేంద్రాన్ని ప్రశ్నించని అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బండారాన్ని సిపిఎం నాయకులు బయట పెట్టనున్నారు.
ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి: విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జిల్లాకు చెందిన వేలాది మంది పర్మినెంట్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరుస్తోంది. సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఎన్నో గ్రామాలు, పట్టణాల్లో పలు ప్రాంతాల అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. వీరి అవసరాలు తీర్చే ట్రాన్స్‌పోర్టు, కూరగాయాలు, టీ, టిఫిన్ వంటి దుకాణాలతో పాటు ఎన్నో వ్యాపారాలు చేస్తూ గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో బతుకీడుస్తున్నవారూ వేలాది మంది ఉన్నారు. ఇటువంటి బంగారుబాతు గుడ్డు లాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం నష్టాల పేరుతో ప్రైవేటు సంస్థకు అమ్మేస్తుందన్న వార్త విస్మయానికి గురిచేస్తోంది. ప్లాంట్ ప్రైవేటీపరమైతే ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల ఉపాధి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు సుమారు ఏడాది క్రితం నుంచి నిరవధికంగా ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారింది. ఈ నేపథ్యంలో దిశమార్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్లాంటును ముక్కలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలో వున్న వైసిపిగానీ, ప్రతిపక్ష టిడిపిగానీ, కేంద్రం వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉన్నట్టుగా చెప్పుకుంటున్న జనసేన గాని కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం లేదు. ఈ మూడు పార్టీలూ లోలోపల లాలూచీ పడడంతోనే కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటువంటి తరుణంలో మన జిల్లాలోని ప్రతి పల్లె తల్లడిల్లుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సుమారు 2లక్షలకుపైగా జీవనం సాగిస్తుండగా, అందులో మన జిల్లాకు చెందినవారు తక్కువలో తక్కువగా 20వేల మంది ఉంటారని అంచనా. ఒక్క కాంట్రాక్టు కార్మికులే సుమారు 5వేల మంది ఉంటారు. పర్మినెంట్ ఉద్యోగులు మరో రెండువేల మంది వరకు ఉండవచ్చు. మొత్తం స్టీల్‌ప్లాంట్ ఆధారంగా గాజువాక ప్రాంతంలో జీవిస్తున్న లక్షలాది మందికి పాలు, కూరగాయాలు, టీ, టిఫిన్, హోటల్స్, ఆటోలు, కార్లు నడుపుతూ వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో బైకు యాత్ర ఒక్క విశాఖపట్నానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లో కూడా సాగనుంది.
ప్రజాశక్తి - బెలగాం
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్ యాత్ర జిల్లాలో ఈనెల 23,24 తేదీల్లో జరగనుందని, ఈ యాత్రను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు పిలుపునిచ్చారు. ఈ మేరకు స్థానిక సుందరయ్య భవనంలో విలేకరుల సమావేశం మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రా అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల ఉపాధికి ఉపయోగపడే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్మకానికి బిజెపి పెడితే వాపక్షాలు తప్ప ఏ పార్టీలు పోరాడడంలేదన్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం 800 రోజులకు పైగా పోరాటం జరుగుతోందన్నారు. దీనికి మద్దతుగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం 6 జిల్లాల్లో బైక్ యాత్ర ఈనెల 20 నుంచి 29వరకు జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పార్వతీ పురం మన్యం జిల్లాలో ఈనెల 23,24తేదీల్లో బైకు యాత్ర జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో ప్రచార సభలు జరుగుతాయన్నారు. సభల్లో రాష్ట్ర, ఉత్తరాంధ్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఈనెల 29న స్టీల్‌ప్లాంట్ వద్ద ముగింపు సభ జరుగుతుందన్నారు. వీటిలో జిల్లా ప్రజలంతా పాల్గొని జయప్రదం చేయాలని, సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. పోస్టర్ ఆవిష్కరణ సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.తిరుపతిరావు, కె.గంగు నాయుడు, వై.మన్మధరావు, వి.ఇందిర, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌వై నాయుడు, రెడ్డి శ్రీదేవి, ఎం.శ్రీనివాసరావు, కోరాడ. ఈశ్వరరావు, జి.వెంకటరమణ, రెడ్డి లక్ష్మునాయుడు పాల్గొన్నారు. పాచిపెంట : ఉక్కు రక్షణ యాత్ర వాల్ పోస్టర్‌ను సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ భవనం వద్ద విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు సూకురు అప్పలస్వామి, సురు రామారావు, కోరాడ ఈశ్వరరావు పాల్గొన్నారు. పాలకొండ రూరల్:ఉత్తరాంధ్ర ఉక్కు రక్షణ బైక్ యాత్ర జయప్రదం చేయాలని, పాలకొండ మండల కేంద్రంలో సిపిఎం బైక్ యాత్ర పోస్టర్ విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం.తిరుపతిరావు, మండల కన్వీనర్ డి. రమణారావు, ఎ.లక్ష్మణరావు, కె.రాము, డి.దుర్గారావు, ఎస్.నారాయణరావు, ఎం.రమేష్, జి.హేమ సుందర్రావు తదితరులు పాల్గొన్నారు. సాలూరు: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం సిపిఎం చేపడుతున్న బైక్ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎన్నై నాయుడు చెప్పారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆయన సిపిఎం పట్టణ నాయకులతో విడుదల చేశారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు టి.వెంకటరావు, టి.రాముడు పాల్గొన్నారు.కొమరాడ :ఉత్తరాంధ్ర బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ సిపిఎం నాయకులు కొల్లి సాంబమూర్తి ఆధ్వర్యాన కొమరాడలో గోడ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు శివున్నాయుడు, రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
బైక్ ర్యాలీ జయప్రదం కోరుతూ ప్రచారం
పార్వతీపురంటౌన్ : విశాఖ స్టీల్ ప్లాంట్‌ను రక్షించుకోవడానికి గానూ సిపిఎం ఆధ్వర్యంలో జిల్లాలో ఈనెల 23, 24న జరిగే బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరుతూ స్థానిక ఎల్‌ఐసి, యూనియన్ బ్యాంకు తదితర చోట్ల సిపిఎం జిల్లా నాయకులు యమ్మల మన్మధరావు గొర్లి వెంకటరమణ, బి.సూరిబాబు మంగళవారం ప్రచారం చేశారు. బైక్ యాత్రను జయప్రదం చేయాలని కోరారు.










