Sep 19,2023 22:03

బైక్‌ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న సిపిఎం నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను గుత్తపెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మానుకోవాలని డిమాండ్‌ చేస్తూ సిపిఎం ఉత్తరాంధ్రలో మోటార్‌ సైకిల్‌ యాత్ర చేపట్టింది. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద బుధవారం బైక్‌జాత ప్రారంభం కానుంది. సాయంత్రం 5గంటలకు విజయనగరం జిల్లా కేంద్రానికి చేరనుంది. 6గంటలకు బాలాజీ జంక్షన్‌లో బహిరంగ సభ నిర్వహించ నున్నారు. రాత్రికి నగరంలోని బసచేస్తారు. జాతాలో కేంద్రాన్ని ప్రశ్నించని అధికార, ప్రతిపక్ష పార్టీల రాజకీయ బండారాన్ని సిపిఎం నాయకులు బయట పెట్టనున్నారు.
విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఏర్పడిన విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో జిల్లాకు చెందిన వేలాది మంది పర్మినెంట్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. ఏటా రూ.వేల కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వానికి సమకూరుస్తోంది. సిఎస్‌ఆర్‌ నిధుల ద్వారా ఎన్నో గ్రామాలు, పట్టణాల్లో పలు ప్రాంతాల అభివృద్ధికి పరోక్షంగా దోహదపడుతోంది. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించింది. వీరి అవసరాలు తీర్చే ట్రాన్స్‌పోర్టు, కూరగాయాలు, టీ, టిఫిన్‌ వంటి దుకాణాలతో పాటు ఎన్నో వ్యాపారాలు చేస్తూ గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో బతుకీడుస్తున్నవారూ వేలాది మంది ఉన్నారు. ఇటువంటి బంగారుబాతు గుడ్డు లాంటి స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వం నష్టాల పేరుతో ప్రైవేటు సంస్థకు అమ్మేస్తుందన్న వార్త విస్మయానికి గురిచేస్తోంది. ప్లాంట్‌ ప్రైవేటీపరమైతే ఉద్యోగాలు తగ్గిపోతాయి. ఉద్యోగుల, కాంట్రాక్టు కార్మికుల ఉపాధి భద్రత ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో సిపిఎం ఆధ్వర్యాన స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులు సుమారు ఏడాది క్రితం నుంచి నిరవధికంగా ఆందోళనలు చేస్తున్న విషయం విధితమే. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంగా మారింది. ఈ నేపథ్యంలో దిశమార్చుకున్న కేంద్ర ప్రభుత్వం ప్లాంటును ముక్కలుగా విభజించి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో అధికారంలో వున్న వైసిపిగానీ, ప్రతిపక్ష టిడిపిగానీ, కేంద్రం వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉన్నట్టుగా చెప్పుకుంటున్న జనసేన గాని కేంద్ర ప్రభుత్వాన్ని బహిరంగంగా ప్రశ్నించడం లేదు. ఈ మూడు పార్టీలూ లోలోపల లాలూచీ పడడంతోనే కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటువంటి తరుణంలో మన జిల్లాలోని ప్రతి పల్లె తల్లడిల్లుతోంది. ఇందుకు కారణం లేకపోలేదు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సుమారు 2లక్షలకుపైగా జీవనం సాగిస్తుండగా, అందులో మన జిల్లాకు చెందినవారు తక్కువలో తక్కువగా 20వేల మంది ఉంటారని అంచనా. ఒక్క కాంట్రాక్టు కార్మికులే సుమారు 5వేల మంది ఉంటారు. పర్మినెంట్‌ ఉద్యోగులు మరో రెండువేల మంది వరకు ఉండవచ్చు. మొత్తం స్టీల్‌ప్లాంట్‌ ఆధారంగా గాజువాక ప్రాంతంలో జీవిస్తున్న లక్షలాది మందికి పాలు, కూరగాయాలు, టీ, టిఫిన్‌, హోటల్స్‌, ఆటోలు, కార్లు నడుపుతూ వేలాది కుటుంబాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో బైకు యాత్ర ఒక్క విశాఖపట్నానికి పరిమితం కాకుండా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అనకాపల్లి, పాడేరు జిల్లాల్లో కూడా సాగనుంది.
బైక్‌యాత్ర సాగుతుందిలా..
విజయనగరం జిల్లా కేంద్రానికి బుధవారం సాయంత్రం 5గంటలకు బైక్‌ ర్యాలీ చేరుకుంటుంది. విటి అగ్రహారంలోని వై.జంక్షన్‌ వద్ద బైక్‌యాత్రకు సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికి, ర్యాలీలో భాగస్వామ్యం కానున్నారు. అక్కడి నుంచి బాలాజీ 'అంబేద్కర్‌) జంక్షన్‌కు చేరుకుంటుంది. అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుంది. బైక్‌యాత్ర చేపట్టిన నాయకులు రాత్రికి విజయనగరంలోనే బస చేస్తారు. గురువారం ఉదయం 10గంటలకు నెల్లిమర్ల, 11గంటలకు చీపురుపల్లి, 1 :30 గంటలకు రాజాం చేరుతుంది. సాయంత్రం 4:30గంటలకు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చేరనుంది. తిరిగి 24న పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రానికి ఉదయం 10గంటలకు చేరుకోనుంది. అదే రోజు 12గంటలకు పార్వతీపురం, 3:30గంటలకు సాలూరు చేరుతుంది. సాయంత్రం 5:30గంటలకు బొబ్బిలి పట్టణానికి చేరుకుంటుంది. బహిరంగ సభ అనంతరం రాత్రికి అక్కడే బస చేయనున్నారు. 25న ఉదయం 10గంటలకు గజపతినగరం చేరుకుంటుంది. అక్కడి నుంచి ఎస్‌.కోట మీదుగా పాడేరు జిల్లాలోకి ప్రవేశిస్తుంది.
బైక్‌ ర్యాలీని జయప్రదం చేయండి
విజయనగరం టౌన్‌ : విశాఖ ఉక్కు పరిశ్రమను పరిరక్షించా లని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం నుంచి చేపట్టనున్న ఉత్తరాంధ్ర బైక్‌ ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు కోరారు. విశాఖలో ప్రారంభం కానున్న సందర్బంగా గోడపత్రికలను మంగళవారం కోట వద్ద, గురజాడ నగర్‌లో సిపిఎం నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ 32మంది ప్రాణ త్యాగాలు, వీరోచిత పోరాటంతో సాధించుకున్న ఉక్కు పరిశ్రమను కారుచౌకగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రంలోని బిజెపి కుట్ర పన్నుతుందని అన్నారు. విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించాలని, నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఖాళీగా ఉన్న ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని, పరిశ్రమ నిర్వహణకు రూ.5వేల కోట్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1000 రోజులుగా స్టీలుప్లాంట్‌ కార్మికులు, అన్ని కార్మిక సంఘాలూ ఐక్యంగా పోరాడుతున్నాయని అన్నారు. వారి పోరాటం విజయవంతం అయ్యేందుకు స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపే వరకు కార్మికులకు అండగా సిపిఎం ఉంటుందని అన్నారు. ఈనేపథ్యంలో వై జంక్షన్‌ వద్ద బైక్‌ ర్యాలీకి స్వాగతం పలికి అనంతరం అంబేద్కర్‌ విగ్రహం జంక్షన్‌కు చేరుకుని సభ నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలంతా బైక్‌ర్యాలీని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు పి.రమణమ్మ, ఎ.జగన్మోహన్‌, బి.రమణ, కంది త్రినాధ్‌ తదితరులు పాల్గొన్నారు.