ప్రజాశక్తి-విశాఖపట్నం
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నుంచి స్టీల్‌ప్లాంట్‌ను రక్షించుకునేందుకు ప్రజా ఉద్యమం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు పిలుపునిచ్చారు. సిపిఎం విశాఖ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలకు ఆయన హాజరై కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. అశేష త్యాగాలతో సాధించబడిన వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రజల సంపద అని, దీనిని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి మోడీ ప్రభుత్వం పూనుకుందని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా సుమారు రెండేళ్లుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, విశాఖ కార్మిక ప్రజా సంఘాలు చేస్తున్న పోరాటాలు అభినందనీయమన్నారు. అయినా మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ప్లాంటును దోచిపెట్టడానికి పావులు కదుపుతోందని తెలిపారు. పార్లమెంట్‌లో రాజకీయాలకతీతంగా పార్టీలన్నీ బిజెపిని నిలదీయాలని కోరారు. ప్లాంటు రక్షణకు జరుగుతున్న పోరాటం ప్రజా ఉద్యమంగా మలిచేందుకు సిపిఎం శ్రేణులు, కార్మిక, ప్రజా సంఘాల పోరాటానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రజలను భాగస్వాములను చేయాలని కోరారు.
మతోన్మాదశక్తులు దేశంలో పెచ్చురిల్లుతున్న నేపథ్యంలో ప్రజల మధ్య ఐక్యత సాధించాల్సిన అవశ్యకత పెరిగిందన్నారు. కేంద్రంతో పాటు రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ప్రజలపై ధరలు భారాలు మోపుతూ నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రజల బెదిరించి యూజర్ ఛార్జీలు పేరుతో చెత్త పన్నులు, వసూలుకు పూనుకోవడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు దీనిని ప్రతి ఘటించాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వీటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.పద్మ, డాక్టర్ బి.గంగారావు, ఆర్‌కెఎస్‌వి.కుమార్, బి.ఈశ్వరమ్మ, కెఎం. శ్రీనివాస్, బి.జగన్ తదితరులు పాల్గొన్నారు.










