ప్రజాశక్తి -తగరపువలస : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్ శుక్ర వారం పాదయాత్ర చేశారు. తగరపువలస జంక్షన్ నుంచి సంగివలస పోలమాంబ గుడి జంక్షన్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విశాఖ నగరానికి వస్తున్న ప్రధాని మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయం నుంచి వెనక్కు తగ్గుతున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో మట్టి, నీరు తెచ్చి శంకుస్థాపన చేసిన అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా ప్రకటించి, పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. 2019 నుంచి విశాఖలో జరిగే భూకొనుగోళ్లపై సిబిఐతో విచారణ జరపాలని కోరారు. విశాఖలో చోటుచేసుకున్న అక్రమాలు, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు ముద్రించిన కరపత్రాలను స్థానికులకు ఆయనే స్వయంగా పంపిణీ చేశారు.










