Nov 09,2022 00:00

స్టీల్‌ప్లాంట్‌ రహదారిలో ప్రచారం నిర్వహిస్తున్న పోరాట కమిటీ ప్రతినిధులు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ప్రధానమంత్రి మోడీకి విజ్ఞప్తి చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు డి.ఆదినారాయణ, వరసాల శ్రీనివాసరావు కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 635వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ సిఒసిసిపి విభాగం కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు సమకూర్చుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో పార్టీలకతీతంగా పనిచేసే ఒరవడి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని పార్టీలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పనిచేయకపోవడం వల్ల ఇప్పటికే భారీ మూల్యం చెల్లించుకున్నామని తెలిపారు. విశాఖ ఉక్కు విషయంలో అలాంటి తప్పు జరగకుండా అన్ని పార్టీలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వ రంగంలో కొనసాగించేందుకు కృషి చేయాలని కోరారు. వామపక్షాలు తప్ప రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
రహదారులపై ప్రచారం
మోడీ పర్యటన సందర్భంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతూ ఉక్కు కార్మికులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మంగళవారం ఉదయం స్టీల్‌ ప్లాంట్‌కు వెళ్లే అన్ని రహదారులపైనా ప్లకార్డులు, ఫ్లెక్సీలతో ప్రచారం చేపట్టారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సమావేశంలో తీర్మానాల మేరకు స్టీల్‌ప్లాంట్‌ లోపల అన్ని విభాగాల్లోనూ సమావేశాలు ఏర్పాటుచేసి ప్రచారం చేశారు. మోడీ పర్యటన సందర్భంగా జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలకు వేలాదిమందిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తున్నట్లు ఈ పర్యటనలో మోడీ ప్రకటన చేయాలని ఉక్కు కార్మిక సంఘం నేతలు, పోరాట కమిటీ నాయకులు విజ్ఞప్తి చేశారు. బుధవారం బైక్‌ ర్యాలీ, 11న కూర్మన్నపాలెం జంక్షన్‌లో నిరసన తెలుపుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు అయోధ్యరామ్‌, నీరుకొండ రామచంద్రరావు, రామ్మోహన్‌కుమార్‌, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.
నేడు బైక్‌ ర్యాలీ
ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు బుధవారం కూర్మన్నపాలెం కూడలి నుంచి నగరంలోని జివిఎంసి గాంధీ విగ్రహం వరకు నిర్వహించే భారీ బైక్‌ ర్యాలీలో ఉక్కు కార్మిక వర్గం పాల్గొనాలని పోరాట కమిటీ పిలుపు నిచ్చింది. మంగళవారం పోరాట కమిటీ నేతలు రోలింగ్‌ మిల్స్‌ విభాగాలలో బైక్‌ ర్యాలీ ప్రచారాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నేతలు జె.అయోధ్యరామ్‌, కె.రాజబాబు, డి.దేముడు, కె.పరంధామయ్య, డివిఆర్‌.రెడ్డి, ట్రినాధం, సీతారామరాజు, శ్రీనివాస్‌ మాట్లాడుతూ బుధవారం ఉదయం 8.30కు ప్రారంభమయ్యే బైక్‌ ర్యాలీలో కార్మికవర్గం పాల్గొని ప్రధానికి గుణ పాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.