ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ పిలుపు
ప్రజాశక్తి- గాజువాక 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణకు చేపట్టే 36గంటల సత్యాగ్రహ దీక్షను చేపట్టనున్నట్లు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, ఎన్ రామారావు వెల్లడించారు.. 14న శనివారం ఉదయం ఆరు గంటల నుంచి, 15న సాయంత్రం 6 గంటల వరకు 36గంటలపాటు చేపట్టే 'ఉక్కు సత్యాగ్రహం' దీక్షను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్టీల్ సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో డి.ఆదినారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో ప్రభుత్వరంగ సంస్థలను తాబేదారులకు కట్టబెడుతూ, దేశ ఆర్థిక పరిస్థితితోపాటు దేశాభివృద్ధికి తీవ్ర విఘాతం కలిగిస్తోందన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా రక్షించేందుకు చేపట్టే ఉక్కు సత్యాగ్రహ దీక్షలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
మంత్రి రాజశేఖర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్ర సాధనకు బ్రిటీషర్లను ఎదిరిస్తూ సత్యాగ్రహమనే మహోన్నత ఆయుధాన్ని నాడు గాంధీజీ ఉపయోగించాడని, నేడు కేంద్రంలోని బిజెపి పాలకుల విధానాలతో ప్రైవేటుకు ధారదత్తం కానున్న స్టీల్‌ప్లాంట్ ఇతర ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు చేపట్టే ఉద్యమాన్ని కొనసాగించడం ప్రస్తుతం అందరి ప్రధాన కర్తవ్యమన్నారు.
ఎన్ రామారావు మాట్లాడుతూ నాటి పాలకులు దేశ ప్రజల ప్రయోజనాల కోసం శ్రమిస్తే, కానీ నేడు ప్రధాని మోడీ దేశంలోని ఖనిజ సంపదను, పోర్టులను, విమానయానం, రైళ్లు, స్టీల్‌ప్లాంట్ ఇలా అన్ని ప్రభుత్వరంగ ఆస్తులను ప్రైవేటుకు కట్టబెడుతూ ప్రజలను మోసపుచ్చుతున్నారన్నారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు చేపట్టే దీక్షల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు కె సత్యనారాయణరావు, నీరుకొండ రామచంద్రరావు, వైటి దాస్, వై మస్తానప్ప, వి రామ్మోహన్‌కుమార్, డివి రమణారెడ్డి, వరసాల శ్రీనివాస్, కొమ్మినేని శ్రీనివాస్, రామ్ కుమార్, గుమ్మడి నరేంద్ర, మంగ వెంకట్రావు, దాసరి శ్రీనివాసరావు, పి శ్రీనివాసరాజు, జె రామకృష్ణ, యు రామస్వామి, బి అప్పారావు, దాలినాయుడు, కారు రవణ, వి ప్రసాద్ పాల్గొన్నారు.










