May 04,2023 00:26

పాడేరులో రాస్తారోకో చేపడుతున్న నాయకులు

ప్రజాశక్తి- అరకులోయ రూరల్‌::విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని అఖిలపక్ష కార్మిక సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా బుధవారం అరకులోయ మండల కేంద్రంలోని నాలుగు రోడ్డు జంక్షన్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో సిపియం, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని కార్మిక వర్గం పెద్ద ఎత్తున గత రెండు సంవత్సరాలుగా ఆందోళన నిర్వహిస్తున్నా మోడీ ప్రభుత్వం మాత్రం మొండిగా వ్యవహరిస్తుందని తెలిపారు.ఎట్టి పరిస్థితుల్లోని స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుకరణ కాకుండా అడ్డుకొని తీరుతామని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కారు చౌకగా ప్రధాని మోడీ అనుచరులకు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
తక్షణమే ప్రైవేటీకరణ ఆపాలని, లేకపోతే భవిష్యత్తులో బిజెపి ప్రభుత్వానికి కార్మికులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.ప్రైవేటీకరణతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దవుతాయని తెలిపారు. కేంద్రంలో మోడీని గద్దెదించేందుకు దేశవ్యాప్తంగా బిజెపి వ్యతిరేక శక్తులు ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకురాలు పాచిపెంట శాంతకుమారి మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం నిత్యావసర ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు మోపుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కె రామారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్బి పోతురాజు, జిల్లా ఉపాధ్యక్షుడు బొండ సన్నిబాబు, గిరిజన సంఘం అరకువేలి మండల అధ్యక్ష కార్యదర్శులు గత్తుం బుజ్జిబాబు, పాంగి రామన్న, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, భగత్రాం, అనంతగిరి సిపిఎం మండల కార్యదర్శి ఎస్‌ నాగులు , కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
పాడేరు:ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకర ణను కేంద్ర ప్రభుత్వం ఆపాలని సిఐటియు అల్లూరి జిల్లా అధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌ డిమాండ్‌ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాడేరు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా సిఐటియు, ఎఐటియుసి కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నయ్య పడాల్‌ మాట్లాడుతూ, లాభాల్లో ఉన్న స్టీల్‌ ప్లాంట్‌ను ఆదానికి కట్టబెట్టడానికి నరేంద్ర మోడీ పూనుకున్నారన్నారు. దీనికి సీఎం జగన్‌ వంత పాడుతున్నారని విమర్శించారు. 32 మంది ప్రాణ త్యాగంతో 64 గ్రామాల ప్రజలు 16500 మంది నిర్వాసితులు 22వేల ఎకరాల భూమిని త్యాగం చేసి ఇచ్చారని తెలిపారు. 1966లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమం మొదలైందని, అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం 4890 కోట్లు ఇచ్చిందన్నారు. ఈ స్టీల్‌ప్లాంట్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో 44 వేల కోట్లు చెల్లించిందని గుర్తు చేశారు. మూడు లక్షల కోట్లు విలువచేసే స్టీల్‌ ప్లాంట్‌ ను కారు సౌకగా 1300 వందల కోట్లకు దారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేయడమంటే దళితులు, గిరిజనుల రిజర్వేషన్‌ తీసేయడమేనన్నారు. నరేంద్ర మోడీ విధానాలు ఈ దేశానికి ప్రమాదమని, ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా కన్వీనర్‌ అమర్‌, సిపిఎం మండల కార్యదర్శి .లింగేరి సుందర్‌రావు, సిపిఐ మండల కార్యదర్శి కూడా రాధాకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మాణిక్యం,. సిపిఐ నాయకులు లక్ష్మణ్‌ పాల్గొన్నారు.