Jul 25,2022 23:16

వాల్‌పోస్టర్లను ఆవిష్కరిస్తున్న సిఐటియు నేతలు

ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో సిఐటియు స్థాపించి 40 వసంతాలు పూర్తి అవుతున్న సందర్భంగా 'స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ- కార్మికుల కర్తవ్యం' అనే అంశంపై ఉక్కునగరంలోని స్టీల్‌ క్లబ్‌ సెక్టార్‌-1లో ఈ నెల 28న మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న సెమినార్‌ను జయప్రదం చేయాలని స్టీల్‌ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జె అయోధ్యరామ్‌, వైటి.దాస్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్లాంట్‌లోని ఎల్‌ఎంఎం పార్కులో సెమినార్‌ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అధ్యక్షులు అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమనే చూపుతోందన్నారు. అందుకే ప్రైవేటుకు కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందన్నారు. స్టీల్‌ సిఐటియు కార్మికులను చైతన్యపరచి కేంద్రం కుట్రలను తిప్పి కొట్టగలిగామన్నారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కర్తవ్యాలను కార్మికులకు వివరించడం కోసమే ఈ సెమినార్‌ను నిర్వహిస్తున్నామని, ప్రతిఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి వైటి దాస్‌ మాట్లాడుతూ సెమినార్‌లో రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి ఎంఎ గపూర్‌, రాష్ట్ర సిఐటియు అధ్యక్షులు సిహెచ్‌ నరసింగరావు, స్టీల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి లలిత్‌ మిశ్రా ముఖ్య వక్తలుగా పాల్గొని, కార్మికుల కర్తవ్యాలను వివరిస్తారన్నారు. కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు నాయకులు బి అప్పారావు, యు రామస్వామి, పి శ్రీనివాసరాజు, నీలకంఠం, కె.వి సత్యనారాయణ, యు వెంకటేశ్వర్లు, బి మహేష్‌, ఆనంద్‌, వి మురళి, శ్రీనివాసులు రెడ్డి, విడివి పూర్ణచంద్రరావు, వీరస్వామి, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు,అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.