Nov 10,2022 00:12

రాస్తారోకో చేస్తున్న ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు

ప్రజాశక్తి- అనకాపల్లి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బుధవారం అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ కూడలిలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి ప్రభావతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రకటనను నిరసిస్తూ కార్మికులు పాదయాత్ర చేస్తుంటే వారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమన్నారు. ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈనెల 12న విశాఖ పర్యటన నేపథ్యంలో స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలుపుదల చేస్తూ ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా మోడీకి ఘన స్వాగతం పలకడం ఆక్షేపిస్తున్నామని పేర్కొన్నారు. రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలరాజు మాట్లాడుతూ దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు గంట శ్రీరామ్‌, పి.మాణిక్యం, ఎస్‌ అరుణ, డి శ్రీనివాసరావు, జి.సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.