Oct 08,2022 23:19

దీక్షలో కూర్చున్న సిఐటియు గోపాలపట్నం జోన్‌ నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : స్టీల్‌ప్లాంట్‌ జోలికి ఎవరు వచ్చినా వారి అంతు చూస్తామని సిఐటియు గోపాలపట్నం జోన్‌ ప్రధాన కార్యదర్శి బి.వెంకటరావు హెచ్చరించారు. స్టీల్‌ ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు శనివారం నాటికి 555వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు గోపాలపట్నం జోన్‌ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలో అత్యంత శక్తివంతంగా, సమర్థవంతంగా, లాభాలలో నడుస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరణ చేయటానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్కరు ఈసరికే గ్రహించారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా అడ్డుకోవడంలో అందరికంటే ముఖ్యమంత్రికి ఎక్కువ బాధ్యత ఉంటుందన్నారు. బిజెపి మినహా అన్ని రాజకీయ పక్షాలు స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నప్పుడు, అన్ని పార్టీల నాయకులను ఢిల్లీ తీసుకువెళ్లి కేంద్రంతో ముఖ్యమంత్రి చర్చించాలని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పలుమార్లు విశాఖ వచ్చినా కనీసం ఉద్యమ శిబిరాన్ని సందర్శించలేదని, స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణ కాకుండా చూస్తామని ప్రకటన చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జి.త్రినాధరావు, కె.శంకర్‌, బి.అప్పలనాయుడు, ఎస్‌.చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.