ప్రజాశక్తి-కలెక్టరేట్, విశాఖ : నగరంలో ఈ నెల 12న జరుగు బహిరంగ సభలో ప్రధాని మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ప్రకటన చేయాలని సిఐటియు మద్దిలపాలెం జోన్ అధ్యక్షులు పి.వెంకటరావు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 580వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో సిఐటియు మద్దిలపాలెం జోన్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ రంగంలోనే స్టీల్‌ప్లాంట్ కొనసాగుతుందని ప్రధాని మోడీ స్పష్టంగా చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని స్టీలుప్లాంట్ల కంటే విశాఖ ప్లాంట్ అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్టీల్ అత్యంత ఉన్నతమైనదని, ప్రపంచంలోనే దీనికి మంచి పేరు ఉందని చెప్పారు. లాభాల్లో నడుస్తున్న స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని, అవసరమైన బొగ్గును సరఫరా చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోతే అన్ని కార్మిక, ప్రజా సంఘాల ఐక్యతతో పోరాటాన్ని ఉధృతం చేసి, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మద్దిలపాలెం జోన్ నాయకులు దండు నాగేశ్వరరావు, అనపర్తి అప్పారావు, ఎం.చంటి, పీతల అప్పారావు, విజయ పాల్గొన్నారు.










